కలం, తెలంగాణ బ్యూరో : మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు (Telangana Assembly Session) అధికార, విపక్షాలు సిద్ధమవుతున్నాయి. పలు అంశాలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ సహా 22-ఏ నిషేధిత భూముల జాబితా, యూరియా కొరత, వ్యవసాయానికి కరెంట్ సరఫరాలో కోత, వెయ్యి రోజుల పాలన, హామీలు అమలులో వైఫల్యం.. ఇలాంటి అన్నింటినీ ఏకరువు పెట్టాలని బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది.
నిషేధిత భూముల జాబితా విషయంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేలా ప్రత్యేక చర్చను టేకప్ చేయాలని అధికార పార్టీ కాంగ్రెస్ భావిస్తున్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని.. నిషేధిత జాబితా అమలు ప్రారంభమైంది మొదలు గత ప్రభుత్వంలో ఎన్ని ఎకరాలు చేరింది, ఎన్ని ఎకరాల మేర రిజిస్ట్రేషన్ అయింది, ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఎకరాలు రిలీజ్ అయింది.. ఇలాంటి వివరాలన్నింటినీ అసెంబ్లీ వేదికగానే బహిర్గతం చేయాలని అధికార పార్టీ అనుకుంటున్నది. దీంతో అసెంబ్లీ సెషన్ వాడివేడిగా సాగనుంది.
ఒక్క అంగుళం కూడా చేరలేదన్న సర్కార్
భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత ఒక్క అంగుళం భూమిని కూడా నిషేధిత (22-ఏ) జాబితాలోకి చేర్చలేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు సందర్భాల్లో తెలిపారు. ఆ చిట్టా విప్పుతానంటూ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్‌ను అమలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నేతలు వారికిష్టమొచ్చిన తీరులో ప్రైవేట్ భూముల్ని వివాదాస్పద భూములు అనే పేరుతో 22-ఏ జాబితాలో చేర్చారని, ఆ తర్వాత బేరాలు కుదుర్చుకుని లిస్ట్ నుంచి బయటకు తీసి రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఇప్పటికే మంత్రి పొంగులేటి ఆరోపించారు.
ఇలాంటి వివరాలన్నింటినీ అసెంబ్లీ వేదికగా బహిర్గతం చేసే అవకాశమున్నది. ఇందులో బీఆర్ఎస్ లీడర్లతో పాటు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవారి పేర్లను కూడా వెల్లడించవచ్చనే మాటలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిషేధిత భూముల జాబితాపై ఇప్పటివరకూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు అసెంబ్లీ వేదికగానే.. ధరణి పేరుతో జరిగిన భూ దోపిడీ గురించి ప్రత్యేక చర్చలో వివరాలు వెల్లడించాలని అధికార పార్టీ కాంగ్రెస్ భావిస్తున్నది.
కాంగ్రెస్ క్లియర్ చేసినవి 23,136 ఎకరాలు
నిషేధిత జాబితాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన భూముల్లో 23,136 ఎకరాల మేరకు ప్రస్తుత ప్రభుత్వం అన్‌లాక్ చేసిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ భూములకు అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ధరణిలో 22-ఏ జాబితాలో పెట్టిందంటూ ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్స్ మేరకు పరిశీలించి జాబితా నుంచి విముక్తి కల్పించినట్లు ఆయన చెప్పారు.
నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములు మాత్రమే ఉండాలని, ప్రైవేటు భూములు ఉండకూడదనే నిబంధన ఉన్నా గత ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడిందని మంత్రి పొంగులేటి సైతం చాలా సందర్భాల్లో వివరించారు. ఇప్పుడు 3,73,524 ఎకరాల వ్యవసాయ భూమి కూడా నిషేధిత జాబితాలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు వివరించారు.
ప్రభుత్వానికి, పట్టా భూమి అని చెప్పుకుంటున్న రైతులకు మధ్య వివాదం నెలకొనడంతో ఎలాంటి లావాదేవీలు జరగకుండా 22-ఏ జాబితాలో పెట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రజలకు చెందిన భూములు నిషేధిత జాబితాలో చేరినట్లు ఇప్పటికైనా బాధితులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు తగిన పరిశీలన చేసి క్లియర్ చేస్తారని సంబంధి ఆఫీసర్లు వివరించారు.
నిషేధిత జాబితాలో భూములు :
మొత్తం భూ విస్తీర్ణం : 2, 49, 97, 312 ఎకరాలు
ఇందులో అటవీ భూములు : 42,61,531.32 ఎకరాలు
అసైన్డ్ భూములు : 24,63,930.05 ఎకరాలు
ప్రభుత్వ భూములు : 16,11,622.35 ఎకరాలు
ఇరిగేషన్, చెరువుశిఖం : 12,04,314.04 ఎకరాలు
పార్కుల్లాంటి ప్రజల అవసరాలకు : 1,50,749.62 ఎకరాలు
దేవాదాయ శాఖ భూములు : 49,143.17 ఎకరాలు
రోడ్లు : 45,875.13 ఎకరాలు
ఇతరాలు : 15,378.35 ఎకరాలు
ప్రభుత్వ-ప్రైవేటు వివాదంలోనివి : 3,73,524 కరాలు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో విముక్తి: 23,136 ఎకరాలకు

