కొండా.. దారెటు?

కలం, తెలంగాణ బ్యూరో: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ (Konda Surekha) బర్తరఫ్ కావడంతో ఇప్పుడు ఆమె అడుగులు ఎటువైపు?.. ఏ పార్టీలోకి వెళ్తారు?.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?.. ఇలాంటి చర్చలు మొదలయ్యాయి. కొండా ఫ్యామిలీ అనుచరుల్లో, వరంగల్ జిల్లా అభిమానుల్లో ఈ డిస్కషన్ మరింత ఎక్కువగా ఉంది. “కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను” అని సురేఖ చెప్తున్నప్పటికీ ఏ రోజు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననే అనుమానం ఆమె అనుచరుల్లో లేకపోలేదు. బర్తరఫ్ తర్వాత సైతం ఆమె ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడడాన్ని కేడర్ ఉదహరిస్తున్నది.

మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ నేతలతోనూ కొండా ఫ్యామిలీ టచ్‌లో ఉందనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌లోకి తీసుకునే ప్రసక్తే లేదంటూ ఆ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకున్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) ఓపెన్‌గానే కామెంట్ చేశారు. బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రమే కాక ఎమ్మెల్యే పదవికి సైతం రిజైన్ చేసిన తర్వాతే చేరిక ఉంటుందనే నిబంధనను వివరించినట్లు పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతున్నది.

కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో రెండేండ్లకుపైగా గడువున్నది. మళ్లీ ఎలక్షన్స్ నాటికి పార్టీలో ఎలాంటి కుమ్ములాటలు, లైన్ దాటడాలకు తావివ్వద్దన్న హెచ్చరికలో భాగం, తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని, చిన్నారెడ్డిపైనా వేటు వేశారని ఆ పార్టీ లీడర్లు చెప్తున్నారు. కొండా సురేఖ (Konda Surekha) ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే జరిగే వరంగల్ ఈస్ట్ (Warangal East) ఉప ఎన్నికలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కూడా అధికార పార్టీ రెడీ అవుతున్నది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఎటు వైపు అడుగులు వేస్తారన్నది హాట్ టాపిక్గా మారింది. కూతురు సుష్మిత చేసిన వివాదాస్పద కామెంట్లు సురేఖ మంత్రి పదవి పోవడానికి కారణమవగా.. ఇప్పుడు కూతురు సైతం పొలిటికల్గా ఏ నిర్ణయం తీసుకుంటారనేదీ ఆసక్తికరంగా మారింది.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని కొండా సురేఖ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసినప్పటికీ.. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు నెలకొంటాయో చెప్పలేమని కొండా ఫ్యామిలీ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజీనామా చేస్తే ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికలో గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, సర్వశక్తులూ ఒడ్డుతుందని, జూబ్లీహిల్స్ తరహాలో పూర్తి ఫోకస్ పెడుతుందని, అధికారంలో ఉన్నందున ఢీకొట్టడం కష్టంగా ఉంటుందనే అభిప్రాయంతోనే ఉప ఎన్నికను ఆమె కోరుకోవడంలేదని, రాజీనామా చేసేందుకు వెనకడుగు వేయడానికి ఇదే కారణమన్నది సన్నిహితుల వాదన. ఒకవేళ రాజీనామా చేస్తే ఆ తర్వాత పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేయాలా?.. లేక మరో పార్టీలో చేరాలా?.. చేరేటట్లయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు టికెట్లపై ఎలాంటి స్పష్టత తీసుకోవాలి?.. ఇలాంటివన్నీ ముడిపడి ఉన్నాయి. అవి తేలకుండా రిజైన్ చేయబోరన్నది కొండా ఫ్యామిలీ సన్నిహితుల మాట.

బీజేపీ వైపు..?!

– మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కంటే ముందు నుంచే కొండా సురేఖ సామాజికవర్గానికి చెందిన బీజేపీలోని ఓ సీనియర్ నేత పార్టీలోకి ఆహ్వానించడంపై చొరవ తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఇప్పుడు బర్తరఫ్ కూడా జరిగిపోవడంతో మరో నేత సైతం ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
– రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పవర్‌లోకి రావాలనుకుంటున్నందున సంస్థాగతంగా బలోపేతం కావడం అవసరమని, ఇప్పుడు కొండా సురేఖను చేర్చుకోవడం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నది ఆ నాయకుడి వాదన.
– కానీ, బీజేపీలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఒక షరతుగానే అమలవుతున్నది. దీనికి తోడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ(Konda Surekha)తో పాటు ఆమె కూతురు సుష్మితకు కూడా పరకాల టికెట్ ఇవ్వడం అనే కండిషన్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సమ్మతించి స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలోకి వెళ్లాలని కొండా ఫ్యామిలీ భావిస్తున్నట్లు ఆ ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు.
– ‘‘నిన్నగాక మొన్నొచ్చిన కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యను ఎంపీనిచేసుకున్నడు. మీరు కనీసం నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించే పరిస్థితుల్లో లేరు. మీరొక చైర్మన్ పదవి తెచ్చుకునే పరిస్థితుల్లోనూ లేరు. కాబట్టి నా ఆలోచన మేరకు నేను ముందుకు వెళ్తా’ అని నా కూతురు సుష్మిత అన్నది. ఆమె స్వతంత్రురాలు” అంటూ బర్తరఫ్ తర్వాత మీడియాతో కొండా సురేఖ వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి కూతురుకు ఎమ్మెల్యే టికెట్ తప్పనిసరి అనే సంకేతం బయటకు వచ్చింది.
– వీలైనంత తొందరగా కొండా సురేఖను బీజేపీలో చేర్చుకునేందుకు కసరత్తు జరుగుతున్నప్పటికీ అధిష్టానం నుంచి వచ్చే రెండు టికెట్ల హామీపైనే అంతా ఆధారపడి ఉందని ఆ పార్టీ నేతలు కొందరు అంటున్నారు.

బీఆర్ఎస్‌లోకి..?!

– ప్రస్తుత పరిణామాలు ఇలానే కొనసాగితే కాంగ్రెస్‌లో దీర్ఘకాలం కొండా ఫ్యామిలీ కొనసాగలేదని, బీఆర్ఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారంటూ ఆమె అభిమానుల్లో మరో చర్చ మొదలైంది.
– గతంలో బీఆర్ఎస్‌లో కొండా సురేఖ పనిచేశారు. అప్పుడు కేసీఆర్ వ్యవహార శైలితో ఇబ్బందుల్లేనందున ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు అభిమానులు చెప్పుకుంటున్నారు. కేటీఆర్‌ కూడా సానుకూలంగానే ఉన్నట్లు వివరిస్తున్నారు.
– అయితే.. ఇదే విషయం గురించి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో కొండా సురేఖను తీసుకునే ప్రసక్తే లేదన్నారు. పార్టీకి కూడా అలాంటి ఉద్దేశం లేదని చెప్పారు. తెలంగాణ భవన్ గేటును కూడా తాకనివ్వబోమన్నారు. ఇప్పటికే తమ పార్టీ నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్‌లో చేరినవారిని కూడా తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోకి వెళ్లి గెలిచి మంత్రి అయిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కేసీఆర్‌పైన నెగెటివ్‌గా కొండా సురేఖ మాట్లాడారని ఆయన గుర్తుచేశారు.
– అటు బీజేపీలో స్పష్టత రావడంలో జాప్యం, ఇటు బీఆర్ఎస్ గేటును కూడా తాకనివ్వబోమని జగదీశ్ రెడ్డి చెప్తుండటంతో కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకం. ‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను, కాంగ్రెస్‌లోనే కొనసాగుతాను’ అని బర్తరఫ్ తర్వాత ఆమె చేసిన ఈ కామెంట్లకు కట్టుబడే ఉంటారని, అలా ఉంటే కాంగ్రెస్‌లో ఇమడగలరా? అనే ప్రశ్న ఆమె అభిమానులను వెంటాడుతున్నది. ఏదైనా త్వరలోనే క్లారిటీ రానున్నది.

Also Read : మినిస్టర్ క్వార్టర్స్‌లోకి కాంగ్రెస్ బాస్.. టీపీసీసీ చీఫ్ సీక్రెట్ మూవ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>