టోల్‌ప్లాజా వద్ద హత్యాయత్నం.. గోవుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

కలం, నేరడిగొండ: టోల్‌ప్లాజా సిబ్బందిపైకి వాహనాలు ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు అక్రమంగా గోవులను తరలిస్తున్న (Cattle Smuggling) అంతర్రాష్ట్ర ముఠాను నేరడిగొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 47 గోవులు, రెండు వాహనాలు, గంజాయి, సెల్‌ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఇచ్చోడ సీఐ సిహెచ్‌. రమేష్‌ తెలిపారు.

ఈనెల 1న నేరడిగొండ నుంచి నిర్మల్‌ వైపు వెళ్తున్న మహీంద్రా బొలెరో వాహనం రోల్‌ మామడ టోల్‌ప్లాజా గేట్లను ఢీకొడుతూ వేగంగా దూసుకెళ్లింది. టోల్‌ సిబ్బంది వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిని హతమార్చే ఉద్దేశంతో వాహనాన్ని సిబ్బందిపైకి ఎక్కించే ప్రయత్నం చేశారు. వెనుక వస్తున్న కంటైనర్‌ లారీ సైతం సైన్‌ కోన్లు, డివైడర్లను ఢీకొట్టి అక్కడి నుంచి పరారైంది. టోల్‌ ప్లాజా సూపర్వైజర్‌ ఎంపల్లి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈనెల 3న తెల్లవారుజామున కుంటాల గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లభించిన సమాచారంతో ఆదిలాబాద్‌ లో మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

అరెస్టయిన వారిలో ఆదిలాబాద్‌ తాటిగూడకు చెందిన ఎండి. షఫీ ముదస్సిర్‌, గోపాల్‌ సింగ్‌ షెకావత్‌, మహారాష్ట్ర నాగ్‌ పూర్‌కు చెందిన ఫిర్దోస్‌ బెగ్‌, మహమ్మద్‌ హైదర్‌ అలీ, క్షితిజ్‌ భీమ్‌రావు సేవట్కర్‌, యవత్మాల్‌కు చెందిన సందీప్‌ విఠల్‌ ముప్పిడివార్‌ ఉన్నారు. మహమ్మద్‌ మజార్‌, రాజు, రవి జగదీష్‌ బాగ్డేల పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ప్రాంతం నుంచి పశువులను అక్రమంగా తరలించి నిజామాబాద్‌ జిల్లా సతాపూర్‌ వైపు తీసుకెళ్లడం ఈ ముఠా ప్రధాన కార్యకలాపంగా పోలీసులు గుర్తించారు. పోలీసుల తనిఖీలను ముందుగానే పసిగట్టి సమాచారం అందించేందుకు బొలెరో వాహనాన్ని ఎస్కార్ట్‌గా వినియోగించేవారని తెలిపారు. ఈ క్రమంలోనే రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద సిబ్బందిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 24 ఎద్దులు, 23 ఆవులు కలిపి మొత్తం 47 పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌లో ఊపిరాడక మూడు పశువులు మృతి చెందగా, మిగిలిన 44 పశువులను సురక్షితంగా గోశాలకు తరలించారు.

అలాగే బొలెరో, కంటైనర్‌ లారీ, 4 గ్రాముల గంజాయి, ఐఫోన్‌ 16 సహా పలు సెల్‌ఫోన్లు, రూ.6,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం, బీఎన్‌ఎస్‌, జంతు హింస నిరోధక చట్టం, గోవధ నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసి బోథ్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రమేష్‌ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఇచ్చోడ సీఐ సిహెచ్‌. రమేష్‌, నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్‌ ఖాన్‌ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>