కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా విద్యాశాఖ ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికపై వివిధ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో వివిధ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఎంపికలో నిబంధనలను పాటించకుండా కొంతమంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారని ఆరోపించారు.
అర్హత కలిగిన సీనియర్ ఉపాధ్యాయులను పక్కనపెట్టి, కేవలం రెండు, మూడు సంవత్సరాల సర్వీస్ ఉన్న వారికి సైతం అవార్డులు ప్రకటించడం సరికాదని పేర్కొన్నారు. సాధారణంగా పదేళ్లకు పైగా సర్వీస్ ఉన్న సీనియర్ ఉపాధ్యాయుల సేవలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. అందుకు విరుద్ధంగా ఎంపిక ప్రక్రియ సాగిందని సంఘాల నాయకులు ఆరోపించారు.
కొన్ని మండలాలకే ప్రాధాన్యం..
జిల్లాలోని అన్ని మండలాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా, కొన్ని మండలాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శించారు. మరికొన్ని మండలాలను ఎంపిక ప్రక్రియలో విస్మరించడం దారుణమన్నారు. అవార్డుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితాను వెంటనే పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. అర్హత, సీనియారిటీ, సేవ వివరాలను పరిగణనలోకి తీసుకుని కొత్తగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని కోరారు.
ఈ సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి జె.లక్ష్మణ్, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దర్శనం దేవేందర్, ప్రధాన కార్యదర్శి గడ్డం భూమన్న, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేంద్రాచారి, ప్రధాన కార్యదర్శి నాగచంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

