కలం, హనుమకొండ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వట్టి నాగులపల్లి వద్ద రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తిని దోచుకునేందుకు ప్రయత్నించారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధమని, తాను చెప్పింది తప్పని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. శుక్రవారం కమలాపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించిన కౌశిక్‌రెడ్డి.. ఇటీవల ఇళ్లను పంపిణీ చేసినప్పటికీ లబ్ధిదారులకు వాటిని పూర్తిస్థాయిలో అందించలేదని, మౌలిక వసతులు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో లక్ష ఎకరాల భూములను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. “మీరు ఏం పని చేశారో చెప్పండి.. నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా” అని పొంగులేటికి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) సవాల్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని, కేసీఆర్‌నే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. పొంగులేటి జాగ్రత్తగా మాట్లాడాలని, తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డా అంటూ కౌశిక్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధంగా ఉంటుందని, కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ కమలాపూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వంటావార్పు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

