కలం, కుబీర్: గొర్రెలను చెరువు నుంచి దాటించే క్రమంలో నీటిలో మునిగి 16 ఏళ్ల యువకుడు మృతి చెందిన విషాద ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ (Kubeer) మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన దేవిదాస్ (16) అనే యువకుడు శుక్రవారం డోడర్న గ్రామ సమీపంలోని ఎల్లమ్మ చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. రోజువారీగా గొర్రెలను మేపేందుకు ముగ్గురు యువకులు వెళ్లారు. గొర్రెలను చెరువులో నుంచి దాటించే క్రమంలో ఇద్దరు యువకులు నీటిలోకి దిగారు. వారిలో ఒకరికి ఈత రావడంతో సురక్షితంగా చెరువు గట్టుకు చేరుకున్నాడు. అయితే ఈత రాని దేవిదాస్ నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టి దేవిదాస్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

