కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ ఫలించింది. కరీంనగర్ (Karimnagar)లోని తీగలగుట్టపల్లి వద్ద ఆర్వోబీ నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరుగుతుండటం, ఈ ఆర్వోబీ నిర్మాణం పూర్తి విషయంలో 2028 వరకు కాంట్రాక్టర్ కు గడువు ఉండటంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు గత కొంతకాలంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.
దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్వోబీ వద్ద వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా తారు రోడ్డును నిర్మించాలని స్థానిక ప్రజలు ఎప్పటి నుండో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో అటువైపు వెళ్లే వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) చొరవ తీసుకుని మున్సిపల్ నిధులతో ఆర్వోబీ వద్ద రోడ్డును యుద్ద ప్రాతిపదికన నిర్మించాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులకు సూచించారు.
కేంద్ర మంత్రి సూచన మేరకు మేయర్ కొలగాని శ్రీనివాస్ రూ.28 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో యుద్ద ప్రాతిపదికన రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణంతో అటువైపు వెళ్లే వాహనదారులకు కొంత ఉపశమనం కలగనుంది. మరోవైపు తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో గత పాలనలో తీవ్ర జాప్యం జరిగింది. నిధుల కేటాయింపులో కేంద్ర, రాష్ట్రాల వాటా ఉన్నప్పటికీ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన వాటా నిధులను చెల్లించలేదు. అయినప్పటికీ నాడు బండి సంజయ్ చొరవ తీసుకుని కేంద్రాన్ని ఒప్పించి ఆర్వోబీ నిర్మాణానికయ్యే రూ.156 కోట్ల మొత్తాన్ని కేంద్రం నుండి మంజూరు చేయించారు.
ఆ తరువాత భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ, ఈ విషయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణను వేగవంతం చేసింది. మరోవైపు ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి 2028 వరకు గడువు ఉండటంతో సదరు కాంట్రాక్టర్ సైతం నత్తనడకన ఆర్వోబీ నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించేందుకు ఆ ప్రాంతంలో రోడ్డును నిర్మించడం గమనార్హం.
Also Read : కేసీఆర్కు కాంగ్రెస్ షాక్.. మహా ధర్నాకు సిద్ధం!
Follow Us On: X(Twitter)

