కలం, పెద్దపల్లి: ఎన్నికల సమయంలో ఇచ్చి సంక్షేమ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ కూడలి వద్ద శుక్రవారం వినూత్న నిరసన (BRS Protest) చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి నాయకత్వంలో మహిళలతో కలిసి ‘వంటావార్పు’ నిర్వహించి, బతుకమ్మ ఆడి ప్రభుత్వంపై నిరసన గళం విప్పారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం, విద్యా భరోసా వంటి పథకాలను విస్మరించారని మండిపడ్డారు. మహాలక్ష్మి కింద నెలకు రూ.2,500 సాయం అందించక ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.82,500 బాకీ పడిందన్నారు. కాంగ్రెస్ పాలన వెయ్యి రోజులకు చేరువవుతున్నా కొత్త పింఛన్లు ఇవ్వలేదని, పెంచిన పింఛన్లు అమల్లోకి రాకపోవడంతో పింఛనుదారులకు రూ.65,000, దివ్యాంగులకు రూ.66,000 చొప్పున బకాయిపడ్డారని విమర్శించారు.
కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లను నిలిపివేసి బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని మనోహర్‌రెడ్డి ఆరోపించారు. హామీలను వెంటనే నెరవేర్చకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార్కు లక్ష్మణ్, ఉప్పు రాజ్‌కుమార్, కౌన్సిలర్ రవీందర్, కొయ్యడ సతీష్, శ్రీధర్, ఇతర నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : కుంభకర్ణుడిలా కేసీఆర్.. కాంగ్రెస్ వినూత్న నిరసన!
Follow Us On : WhatsApp

