కలం, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ఎడమ కాలువ పరిధిలో భారీగా జల వృథా కొనసాగుతోంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే రెండు చోట్ల కాలువలకు భారీగా గండ్లు పడటంతో రైతాంగం భయాందోళనలకు గురవుతోంది. గురువారం త్రిపురారం మండలం తుంగపాడు మేజర్ కాలువ తెగిపోగా, శుక్రవారం నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలం అనుముల సమీపంలో ఉన్న రాజవరం మేజర్ కాలువకు భారీ గండి పడింది.
కృష్ణానదికి వరద ఉధృతి పెరగడంతో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా చెరువులు, కుంటలు నింపేందుకు అధికారులు నీటిని విడుదల చేశారు. అయితే, అలవాల వద్ద కాలువ కట్ట నీటి ఉధృతికి తట్టుకోలేక తెగిపోవడంతో వేలాది క్యూసెక్కుల సాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. పక్కనే ఉన్న పంట పొలాల్లోకి నీరు భారీగా చేరడంతో చేతికి వచ్చిన పంటలు నీటమునిగి నష్టం వాటిల్లుతోంది.
ఒకవైపు సాగునీరు లేక పంటలు ఎండిపోతాయేమోనని దిగులు చెందుతున్న తరుణంలో ఉన్న నీరు కాస్తా ఇలా అధికారుల నిర్లక్ష్యం వల్ల వృథా పోతుండటంపై రైతులు మండిపడుతున్నారు. నిన్న ఒకచోట గండి పడినా నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం కాకపోవడం వల్లే, నేడు రాజవరం కాలువకు కూడా గండి పడిందని విమర్శిస్తున్నారు. కాలువకు గండి పడి గంటలు గడుస్తున్నా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
మరమ్మతులు చేపట్టడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన స్పందించి రాజవరం మేజర్ కాలువ గండిని వెంటనే పూడ్చివేయాలని డిమాండ్ చేశారు. ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

