జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని (Zaheerabad) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భారీ పాము ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఆసుపత్రిలోని డెలివరీ, చిన్నపిల్లల వార్డుల సమీపంలో ఓ పెద్ద పాము కనిపించడంతో ఆ ప్రాంగణమంతా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. వార్డుల్లో ఉన్న రోగులు, బాలింతలు, పసిపిల్లల బంధువులు భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో పొట్టుపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ధైర్యంగా స్పందించారు. ఆ పామును చంపి బయటకు తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆసుపత్రి నిర్లక్ష్యంపై ఆగ్రహం

ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుధ్య లోపం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి చుట్టూ చెత్తాచెదారం, పొదలు విపరీతంగా పెరిగిపోవడంతోనే పాములు, ఇతర విషకీటకాలు వార్డుల్లోకి వస్తున్నాయని బాలింతల కుటుంబ సభ్యులు ఆరోపించారు. శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం  ప్రాణాలమీదకు వస్తోందని మండిపడ్డారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయిన చెత్తను, పొదలను వెంటనే తొలగించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. శానిటేషన్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత సిబ్బందిపై ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>