కలం, వెబ్‌డెస్క్: కొండా సురేఖ (Konda Surekha)ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boianapalli Vinod) కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో సయోధ్య లేదని, ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం కూడా లేదన్నారు. మంత్రులకు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, అన్ని నిర్ణయాలు సీఎం ఆఫీస్‌లోనే తీసుకుంటున్నారని మంత్రులే చెప్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రజా సమస్యలపై పని చేయడం లేదని, హామీలు నిలబెట్టుకోవడం లేదని చెప్పారు.
కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా ఇదే బహిరంగంగా చెప్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ చేస్తున్న ఆరోపణలు నిజమే కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కొండా సురేఖ, కొండా మురళి వైఎస్ఆర్ అండగా రాజకీయంగా ఎదిగారన్నారు. సురేఖ తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేసే మనిషి అని, ఆమె ప్రజా నాయకురాలు అని కొనియాడారు. బీఆర్ఎస్‌లో చేరిక గురించి కొండా సురేఖతో ఎలాంటి చర్చలు జరపలేదన్నారు.
సీఎం రేవంత్ మోదీతో వ్యవహరిస్తున్న తీరుతో కాంగ్రెస్ హై కమాండ్ కూడా ఆందోళనలో ఉందన్నారు. వీరిద్దరూ బడే భాయ్, చోటే భాయ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. గతంలో బీజేపీ సైతం పక్క పార్టీ నాయకులను ఎంతో మందిని ఆఫర్లు ఇచ్చి తీసుకుందని, సీఎం రేవంత్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. ఇక బీజేపీలో హరీశ్ రావు చేరుతున్నారని వస్తున్న వార్తలపై వినోద్ కుమార్ (Boianapalli Vinod) స్పందించారు. హరీశ్ రావు అంటే గిట్టని రాజకీయ శక్తులే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని, ఎన్నో ఏళ్ల నుంచి ఆయనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని, వీటిని ఆయన కూడా స్వయంగా ఖండించారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన హరీశ్ రావు పార్టీ మారే అవకాశమే లేదన్నారు.
Also Read : పోలవరం డిజైన్‌ను కేంద్రం పునఃపరిశీలించాలి.. పొంగులేటి డిమాండ్
Follow Us On: X(Twitter)

