ఛత్తీస్‌గఢ్‌ సీఎంతో మంత్రి ఉత్త‌మ్ భేటీ!

క‌లం, వెబ్‌డెస్క్: సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా అనుమతులు జారీ చేయాలని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్‌ సాయితో మంత్రి ఉత్తమ్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టు నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములు, ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైతే పరిహార నిధులను ముందుగానే జమ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, పరస్పర సహకారం, సంప్రదింపుల ద్వారా పెండింగ్‌ అంశాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సమ్మక్క సాగర్‌కు సంబంధించిన అంతర్రాష్ట్ర అంశాలు, బ్యాక్‌వాటర్‌ ప్రభావం, ముంపునకు గురయ్యే భూములు, నివాస గృహాలు, బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఓసీ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రాజెక్టు నుంచి సాగునీటి ప్రయోజనాలను రైతులకు అందించేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సహకరించాలని ఉత్తమ్‌ కోరారు. అలాగే రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తూ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్​ పేర్కొన్నారు.

46.96 టీఎంసీల నీటి మళ్లింపే లక్ష్యం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై సమ్మక్క సాగర్‌ బ్యారేజీని నిర్మించారు. బ్యారేజీ మొత్తం పొడవు 1,143 మీటర్లు ఉంటుంది. ఈ బ్యారేజీకి 59 రేడియల్‌ గేట్లు ఉన్నాయి. పూర్తి జలాశయ మట్టం +83 మీటర్ల వద్ద 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా బ్యారేజీని రూపొందించారు. సాగునీటి అవసరాల కోసం గోదావరి నది నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ఎన్​వోసీ కోసం గత ఏడాది నుంచి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>