కలం, తెలంగాణ బ్యూరో: కొండా సురేఖ స్థానంలో వీలైనంత తొందరగా మంత్రివర్గంలోకి మరొకరిని తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భావిస్తున్నారా?.. ఖాళీగా ఉన్న మరో రెండు బెర్తుల్ని సైతం దాంతోపాటే భర్తీ చేయాలనుకుంటున్నారా?.. ఆలస్యం లేకుండా తొందరగా పూర్తయ్యేలా గవర్నర్‌తో చర్చించారా?.. ఇలాంటి ప్రశ్నలకు విశ్వసనీయ వర్గాలు మాత్రం ‘ఔను’ అనే సమాధానాన్నే ఇస్తున్నాయి. ఖాళీల భర్తీతో పాటు పలువురు మంత్రుల శాఖలను కూడా మార్చే ఆలోచన ఉన్నట్లు తెలిసింది.
గత కొన్ని రోజులుగా రాష్ట్ర కేబినెట్‌లోని రెండు ఖాళీలను భర్తీ చేయాలనుకుంటున్నప్పటికీ ప్రతీసారి ఏదో ఒక కారణం అడ్డుపడుతున్నదని, ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్‌తో ఆలస్యం లేకుండా తొందరగా కంప్లీట్ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎవరిని కేబినెట్‌లోకి తీసుకోవాలో గ్రీన్సిగ్నల్ కూడా లభించినట్లు తెలిసింది. కొండా సురేఖ విషయంలో గురువారం సాయంత్రం లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి.. మంత్రివర్గ విస్తరణ అంశాన్ని కూడా చర్చించినట్లు సమాచారం.
మంత్రివర్గంలోకి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న మహేశ్‌కుమార్ గౌడ్ మంత్రివర్గంలోకి రానున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించే అవకాశమున్నది. మహేశ్ గౌడ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అదేవిధంగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే చాన్స్ ఉందని, కొండా సురేఖ స్థానంలో బీసీ మహిళగా ఆమె రావచ్చనే మాటలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న విజయశాంతి.. పార్టీ యాక్టివిటీస్‌లో పెద్దగా పాల్గొనడంలేదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. బాధ్యతలు అప్పజెప్తే యాక్టివ్ అవుతారనే వాదన ఒకవైపు, సైలెంట్‌గా ఉండడానికి కారణమూ అదేననే వాదన ఇంకోవైపు వినిపిస్తున్నది. మంత్రులుగా అవకాశం ఎవరికి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి విచక్షణకే ఏఐసీసీ వదిలేసినట్లు తెలిసింది. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయించడంతో పాటు రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సమాంతరంగా నడిచే మెకానిజం బాధ్యతలను కూడా ముఖ్యమంత్రి అప్పజెప్పినట్లు సమాచారం.
పీసీసీ చీఫ్‌గా బలరాం నాయక్!
ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న మహేశ్ గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే.. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపైనా కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌ను పీసీసీ కొత్త చీఫ్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపైనా..!
– అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా గతంలో రామచంద్ర నాయక్ పేరును సీఎం రేవంత్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టలేదు. ప్రభుత్వ విప్‌గానూ కొనసాగుతున్న రామచంద్ర నాయక్ కేబినెట్‌లో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే బాలూనాయక్ సైతం మంత్రివర్గంలోకి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ చీఫ్‌తోనూ సమావేశమయ్యారు.
– ఇప్పుడు మంత్రివర్గంలో చోటు రానివారిలో ఒకరికి చీఫ్ విప్ బాధ్యతలు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్‌గానూ ఆశావహుల్లో ఒకరిని సర్దిపుచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. రామచంద్ర నాయక్, బాలూనాయక్.. వీరిద్దరిలో ఒకరికి చీఫ్ విప్, మరొకరికి డిప్యూటీ స్పీకర్ పోస్టులు వచ్చే అవకాశాలున్నాయి.
– ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న గడ్డం ప్రసాద్ మంత్రివర్గంలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికీ తాజాగా ఢిల్లీ టూర్‌లో సానుకూల సంకేతం రాలేదని పార్టీ వర్గాల సమాచారం. ఒకరిద్దరు మంత్రుల్ని తొలగించే అవకాశం ఉందని వార్తలు వచ్చినా అటు పార్టీ, ఇటు ప్రభుత్వం నుంచి ధృవీకరణ లేదు.
– వీలైతే శనివారం లేదా ఆదివారమే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సచివాలయ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే.. గవర్నర్‌తో సీఎం భేటీలో జరిగిన చర్చల వివరాలు బహిర్గతం కాలేదు. మంత్రివర్గ విస్తరణ ఉండటం ఖాయమని, అది ఫలానా తేదీన అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

