కలం, తెలంగాణ బ్యూరో: కూతురు సుష్మిత వ్యాఖ్యలపై కనీసమైన ‘రిగ్రెట్స్’ లేకుండా తనకేం సంబంధం.. అంటూ వ్యాఖ్యానిస్తున్న కొండా సురేఖ (Konda Surekha) ఒక దశలో ఏఐసీసీ నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా, బ్లాక్ మెయిల్ చేసేలా వ్యవహరించారన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపించింది. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారంటూ, మహిళనైన తనపై చర్యలు సహించరంటూ హెచ్చరిక టోన్‌లో కూడా సురేఖ చేసిన వ్యాఖ్యలకు దీటుగా సీఎం రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో మాస్టర్ స్ట్రోక్ విసిరారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతోపాటు.. ముగ్గురు మహిళలకు కీలక పదవులు అప్పగించారు.
ఆ ముగ్గురు బీసీ మహిళలే కావడం గమనార్హం. వీరిలో ఒకరికి కేబినెట్ ర్యాంక్, మరొకరికి రాజ్యాంగబద్ధమైన పదవిని సీఎం కల్పించారు. ఇంకొకరికి నామినేటెడ్ పోస్ట్ అప్పగించారు. బీసీ, మహిళ అంటూ కొండా సురేఖ అందుకున్న ఎజెండాకు ముగ్గురు బీసీ మహిళలకు కీలకమైన పదవులు ఇవ్వడం ద్వారా చెక్ పెట్టినట్లయిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
బీసీ సంఘాలు ప్రశ్నించే వీల్లేకుండా!
బీసీ సంఘాలు సైతం కొండా సురేఖ అంశాన్ని ప్రస్తావించడానికి, ప్రశ్నించడానికి వీలు లేకుండా ముఖ్యమంత్రి బీసీ అస్త్రాన్నే ప్రయోగించారు. కొండా సురేఖ ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను పద్మశాలి.. నా భర్త మున్నూరు కాపు.. బీసీ మహిళ అయినందునే నాకు షోకాజ్ నోటీసు ఇచ్చారు.. రెడ్డి నేతల పట్ల పార్టీ తీరు మరోలా ఉంది. నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు” అంటూ వ్యాఖ్యానించారు. బర్తరఫ్ చేసిన తర్వాత కులం ప్రస్తావన తెచ్చి బీసీ సంఘాల్లో అయోమయం సృష్టిస్తారని కాంగ్రెస్ పెద్దలు ముందుగానే గ్రహించారు. దీంతో ముఖ్యమంత్రి సైతం పద్మశాలి మహిళ గుండు సుధారాణి(Gundu Sudharani)ని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా నియమించారు.
మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మి(Gadwal Vijayalaxmi)ని కేబినెట్ ర్యాంక్‌కు సమానమైన స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా అపాయింట్ చేశారు. గౌడ్ సామాజిక వర్గానికి చెందిన నేరెళ్ల శారద(Nerella Sharada)ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు. ముగ్గురూ మహిళలే.. ముగ్గురూ బీసీ సామాజికవర్గాలకు చెందినవారే. చిన్నారెడ్డిపై వేటు వేయడంతో ఖాళీ అయిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్పర్సన్ పోస్ట్ గద్వాల విజయలక్ష్మి దక్కింది. ఇక, నేరెళ్ల శారద గతంలోనూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఈ ముగ్గురు మహిళలకు కీలక పదవులు అప్పగించడంతో కొండా సురేఖ (Konda Surekha) విమర్శించడానికే వీల్లేకుండా ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు పార్టీలో టాక్ వినిపిస్తున్నది.
Also Read : మేం మాట్లాడితే తట్టుకోరు.. కొండా మురళీ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

