కలం, ఖమ్మం బ్యూరో: నిరుద్యోగ యువత కలలను సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కట్టుబడి ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 72,000 ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. గురువారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురంలో పర్యటించారు. రూ. 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
గత రెండున్నర ఏళ్లలో ఈ ఒక్క గ్రామానికే రూ. 4 కోట్లు మంజూరు చేయడమే కాక సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, విద్యుత్తు, అంగన్వాడీ, తాగునీటి సౌకర్యాలు కల్పించామన్నారు. మొదటి రెండు విడతల్లో 7 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.1,76,000 కోట్లు జమ చేశామన్నారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ. 67,000 కోట్లు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చామని పొంగులేటి తెలిపారు.
పోలీస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ..
అనంతరం ఖమ్మం నగరంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్‌లో పీఎస్ఆర్ ట్రస్ట్, రైట్ ఛాయిస్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. శిక్షణకు హాజరవుతున్న సుమారు 2,300 మంది అభ్యర్థులకు ఉచిత బోధన, స్టడీ మెటీరియల్‌తో పాటు సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
రాబోయే 60 రోజుల కాలాన్ని క్రమశిక్షణతో ఉపయోగించుకుని ఉద్యోగాలు సాధించాలని యువతకు మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ.. అభ్యర్థుల విజయంలో 90 శాతం వారి మానసిక దృక్పథం, ఆత్మవిశ్వాసమే కీలక పాత్ర పోషిస్తాయని మార్గదర్శనం చేశారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు డీసీపీ రామానుజం, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

