కలం, స్పోర్ట్స్: బుమ్రా ఫిట్‌నెస్‌పై కీలక విషయం బయటపడింది. శ్రీలంక టెస్టు జట్టు ఎంపికకు ముందు అతడు అందుబాటులో లేడన్న సమాచారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు తెలియలేదని తెలుస్తోంది. ఈ అంశంపై గురువారం ముంబైలో జరిగిన బీసీసీఐ సమీక్ష సమావేశంలో చర్చ జరిగింది. సెలక్షన్ కమిటీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మధ్య సరైన సమాచారం లేకపోవడంతో గందరగోళం ఏర్పడినట్లు సమావేశంలో గుర్తించారు. బుమ్రా ఫిట్‌నెస్‌పై స్పష్టత కోసం అగార్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఈమెయిల్ పంపాల్సి వచ్చింది.
అందుబాటులో టెస్టులకు బుమ్రా!
కనీసం ఒకటి, రెండు శ్రీలంక టెస్టులకు బుమ్రా అందుబాటులో ఉంటాడని అనధికారికంగా సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుమ్రాను ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ జట్టులో ఫిట్నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఎంపిక చేశారు. సెప్టెంబర్ 9న అతడికి ఫిట్నెస్ టెస్ట్ ఉంది. వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాకు కూడా అదే రోజు ఫిట్నెస్ పరీక్షలు జరగనున్నాయి.
హార్దిక్ ఫిట్నెస్పైనా ఆందోళన
మరోవైపు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఫిట్నెస్ కూడా బీసీసీఐకి ఆందోళనగా మారింది. వన్డేల్లో అతడు ఐదు లేదా ఆరు ఓవర్లకు మించి బౌలింగ్ చేయలేకపోతున్నట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికలో హార్దిక్ కీలక ఆటగాడు. అందుకే అతడి ఫిట్‌నెస్‌పై జట్టు మేనేజ్మెంట్, సెలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక రానున్న రోజుల్లో ఆటగాళ్ల ఫిట్నెస్, గాయాలపై సెలెక్టర్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని బీసీసీఐ సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది.

