కలం, వెబ్‌డెస్క్: నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు (Nepal Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆకస్మిక వరదల్లో గల్లంతైన తమ ఆత్మీయుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే రోజుల తరబడి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో పలువురు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో చేసేదేం లేక త్రిశూలీ నది తీరంలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులు సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు (Funerals) నిర్వహిస్తున్నారు.
హిందూ సంప్రదాయాల ప్రకారం గల్లంతైన తమ ఆత్మీయుల ప్రతిరూపంగా కర్రలు, ఇతర సామగ్రితో బొమ్మలను రూపొందించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అందరూ తమ వారిని తల్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒకవైపు తమ వారు తిరిగి వస్తారనే ఆశ ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఆచూకీ లభించకపోవడంతో ఈ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్రిశూలీ తీరమంతా అంత్యక్రియలు నిర్వహించే వారితో విషాద ఛాయలు అలుముకున్నాయి.

