కొండా.. బీసీ ఎజెండా..!

కలం, తెలంగాణ బ్యూరో: మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదని ముందుగా గ్రహించడంతోనే కొండా సురేఖ (Konda Surekha) బీసీ రాగం ఎత్తుకున్నారా? పద్మశాలి, మున్నూరుకాపు అంటూ ఆమె కులాల ప్రస్తావన తేవడం వెనక ఉద్దేశమేంటి? మీడియాతో చిట్‌చాట్‌లో ‘‘నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు.. నేను పద్మశాలీని, నా భర్త మున్నూరుకాపు’’ అని ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది?..ఇలాంటి ప్రశ్నలతో కొండా సురేఖ చాలా అడ్వాన్స్‌గానే తదుపరి యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారనే చర్చలు పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను గత నెల లాస్ట్ వీక్‌లో ప్రజాభవన్‌లో కలిసిన తర్వాత సురేఖ భర్త కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ, “నా బిడ్డ ‘ప్లాన్-ఏ’ ప్రకారం ఆ కామెంట్లు చేశారు. ‘ప్లాన్-బీ’ ప్రకారం ఏం చేస్తుందో?.. మాకెలా తెలుస్తుంది?” అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొండా సురేఖ ‘ప్లాన్-బీ’ అనే ప్రస్తావన లేకుండా.. బీసీలు ఏకమవుతారని చెప్పడంతో ఈ క్రైసిస్‌కు కులం కార్డు ఉపయోగించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పైగా రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారని.. పద్మశాలీ, మున్నూరు కాపు 16 శాతం ఉన్నారని కొండా సురేఖ వ్యాఖ్యానించడం గమనార్హం. బీసీలు తనకు అనుకూలంగా ఏకం కావాలని ఆమె సంకేతాలిస్తున్నారా?.. లేక ఇప్పటికే ఆ తరహా గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేశారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

బీసీ సంఘాలు మద్దతిస్తాయా?

– ఏఐసీసీ తనపైన చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారంటూ కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారాయి. బీసీలపైన చర్యలు తీసుకుంటున్న క్రమశిక్షణ కమిటీ ‘రెడ్డి’ల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నదంటూ ఇప్పటికే విమర్శలున్నాయి. కొండా సురేఖ ఈ విమర్శలను తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారని ఆమె తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నది.
– మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ప్రస్తావించి, ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఓపెన్‌గానే కామెంట్ చేశారు. దీనిపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించి.. ఆయన పార్టీ లైన్ దాటలేదని వివరణ ఇచ్చారు.
– కొండా సురేఖపై ఏఐసీసీ యాక్షన్ తీసుకున్న పక్షంలో.. ఆమె వ్యాఖ్యానించినట్లుగా బీసీలు ఏకమవుతారా అనే సరికొత్త చర్చ నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో పద్మశాలీలు 3.3%, మున్నూరుకాపు 3.9% చొప్పున ఉన్నట్లు తేలింది.

ప్రో, యాంటీ-సీఎం గ్రూపులున్నాయా?

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రూపులుగా ఏర్పడ్డారంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి కొందరు మంత్రులు సపోర్టు చేయడంలేదని, విపక్షాలు తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా ఆ మంత్రులు అండగా నిలబడడంలేదనే అభిప్రాయం కూడా బలంగానే వినిపిస్తున్నది. గతేడాది ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన ఫామ్హౌస్ మీటింగ్.. చర్చకు దారితీసింది. అది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దృష్టికి కూడా వెళ్లింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి లండన్ టూర్‌లో ఉండగా.. ఇలాంటి ఫామ్‌హౌస్‌ వ్యవహారమే పార్టీలో చర్చకు దారితీసింది. వీటికి తోడు కొండా సురేఖ కూతురు సుష్మిత ‘‘అచ్చ కాంగ్రెస్.. పచ్చ కాంగ్రెస్’’ అంటూ ఒరిజినల్ కాంగ్రెస్, మైగ్రేటెడ్ కాంగ్రెస్.. అనే అర్థంలో పరోక్షంగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. ఇప్పుడు కొండా సురేఖపై ఏఐసీసీ యాక్షన్ తీసుకుంటే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లలో ఎంతమంది ఆమెకు మద్దతు పలుకుతారు? మంత్రివర్గంలోని బీసీల వాయిస్ ఎటువైపు ఉంటుంది? ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గ్రూపు ఏర్పడితే అందులో ఎవరెవరు ఉంటారు?.. ఇలాంటి చర్చలూ మొదలయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>