కూతురు తెచ్చిన తుఫాన్‌.. తల్లి పదవికి టెన్షన్!

కలం, వరంగల్‌ బ్యూరో: సీఎం రేవంత్‌ రెడ్డిపై కొండా సుస్మిత (Konda Susmita) చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం చివరకు ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పదవికి చుట్టుకుంది. సుస్మిత వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్‌ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో పార్టీ సురేఖకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రాఖీ రోజు సీఎం రేవంత్‌కు సురేఖ రాఖీ కట్టడంతో రాజీ కుదిరిందనే సంకేతాలు వెలువడ్డాయి. తాజాగా సీఎంను ఉద్దేశించి సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేయడం మరోసారి హాట్ టాపిక్​గా మారింది.ః

కూతురు వ్యాఖ్యలతో రేగిన చిచ్చు

మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల రోజున ఆమె కుమార్తె సుస్మిత.. సీఎంతో పాటు కొందరు కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు సురేఖపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని, పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. సురేఖను వివరణ కోరుతూ పార్టీ షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా ఆమె స్పందించారు. తన కూతురు వ్యాఖ్యలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అందుకు తాను బాధ్యత వహించాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. కొండా మురళి కూడా కూతురు వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవేనని పేర్కొన్నారు. దీంతో వివాదం కొంత సద్దుమణిగినట్లు కనిపించింది. అయితే.. రాఖీ పండుగ రోజున సీఎం రేవంత్‌కి మంత్రి సురేఖ రాఖీ కట్టడం రాజకీయంగా ఆసక్తి రేపింది. కూతురు వ్యాఖ్యల వివాదానికి తెరపడిందని, సీఎం, మంత్రి మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వచ్చాయని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో కొండా కుటుంబం, రేవంత్‌రెడ్డి మధ్య తలెత్తిన వివాదం ముగిసినట్లేనని భావించారు. అయితే తాజాగా సురేఖ చేసిన వ్యాఖ్యలు మళ్లీ రాజకీయ వేడిని పెంచాయి.

మళ్లీ సీఎంపైనే గురి

ఢిల్లీలో అధిష్టానం ముందు హాజరైన మంత్రి సురేఖ నేరుగా ముఖ్యమంత్రిపై ప్రశ్నలు సంధించారు. అక్కడ ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరలేపాయి. దీంతో సుస్మిత వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు సురేఖ, రేవంత్‌రెడ్డి మధ్య విభేదాల అంశంగా మారింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలను అధిష్టానం ఎలా తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సురేఖపై మంత్రి పదవికి సంబంధించి ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. దీంతో ప్రస్తుతం చర్యలు ఉంటాయా? లేదా పార్టీ మరోసారి రాజీ మార్గాన్ని ఎంచుకుంటుందా? అనేది అధిష్టానం నిర్ణయంపై ఆధారపడి ఉంది. కొండా సురేఖ వ్యవహారం రాష్ట్రస్థాయి రాజకీయ అంశంగా మారడంతో దీని ప్రభావం వరంగల్‌ కాంగ్రెస్‌ రాజకీయాలపై పడే అవకాశముంది.

జిల్లాలో ఇప్పటికే నేతల మధ్య ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలు, భవిష్యత్‌ రాజకీయ అవకాశాలపై పోటీ నెలకొంది. ఇప్పడు సురేఖ, రేవంత్‌ మధ్య పరిణామాలు స్థానిక రాజకీయ సమీకరణాలకు ప్రాధాన్యం చేకూర్చాయి. మొత్తంగా చూస్తే.. కూతురు సుస్మిత వ్యాఖ్యలతో మొదలైన వివాదం సురేఖకు షోకాజ్‌ నోటీసులు, సీఎంకు రాఖీతో సయోధ్య సంకేతాలు, మళ్లీ సీఎంపై ఘాటు వ్యాఖ్యలు పరిణామాల పరిణామాలు ఎటు మలుపు తీసుకుంటాయో తెలియదు. కానీ కొండా కుటుంబం, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య రాజకీయ విభేదాలు పూర్తిగా సమసిపోలేదనే చర్చకు బలం చేకూర్చాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>