కృష్ణమ్మ పారుతోంది.. పాలమూరు ఎండుతోంది..!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కరువు ప్రాంతంగా పేరొందిన ఉమ్మడి మహబూబ్​ నగర్​ (Mahabubnagar) జిల్లాలో సాగునీటి పంచాయితీ దశాబ్దాలుగా తీరని సమస్యగానే మిగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు, నిధులు, నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందనే నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగింది. స్వరాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు దాటినా కానీ పాలమూరు జిల్లా ప్రజలకు కృష్ణా జలాల్లో (Krishna Water) న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం పోరాటాలు మాత్రం ఆగడం లేదు.

తొలి పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడంపై ఆసక్తి చూపలేదని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రెండున్నరేళ్లకు పైగా పాలన సాగిస్తున్నప్పటికీ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సంసిద్ధత చూపడం లేదని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆరోపిస్తోంది.

జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతోనే కృష్ణా నదిలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటాను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నామని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు నీటి మళ్లింపు ఎక్కువవుతోందని జేఏసీ పేర్కొంటోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 512 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వినియోగించుకుంటోందని, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతి లేకుండానే నీటిని విడుదల చేసుకుంటోందని తెలంగాణ చేస్తున్న ఫిర్యాదులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదని జేఏసీ వాదిస్తోంది. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన 500 టీఎంసీల వాటా కోసం బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు పోరాటం కొనసాగుతోందని పేర్కొంది. నీటి వాటా తేలే వరకు పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు నికర జలాలు లభించడం కష్టంగా మారుతుందని జేఏసీ అంటోంది.

ప్రాజెక్టులు పూర్తయితేనే నీటి వినియోగం

“మన రాష్ట్రానికి నీటి కేటాయింపులు కాగితాలపై 299 టీఎంసీలుగా ఉన్నప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం. ఇందుకు ప్రాజెక్టులు పూర్తికాకపోవడమే ప్రధాన కారణం. రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడంతో రాష్ట్ర వాటా నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణలోని ఇబ్బందులతో రాష్ట్రానికి రావాల్సిన నీటిలో కొంత భాగం కూడా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో లేని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా భారీగా నీటిని తరలిస్తోంది. ఇదంతా తెలంగాణ పాలకుల చేతగానితనానికి నిదర్శనం” అని పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన సమితి వాదిస్తోంది. ఈ పరిస్థితి తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రయోజనాలను దెబ్బతీస్తోందని పేర్కొంటోంది.

దశాబ్దాలుగా అన్యాయంతోనే వివాదాలు

కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై స్పష్టత లేకపోవడం, దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం కారణంగానే ఈ నీటి వివాదాలు కొనసాగుతున్నాయని జేఏసీ చెబుతోంది. అంతర్జాతీయ నదీ జలాల సూత్రాలు, బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులను పరిశీలిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రిబ్యునల్‌ 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో దాదాపు 68 నుంచి 70 శాతం తెలంగాణలోనే ఉందని జేఏసీ పేర్కొంటోంది.

ఈ లెక్కన 811 టీఎంసీలలో తెలంగాణకు కనీసం 555 నుంచి 575 టీఎంసీల వరకు వాటా దక్కాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోందని చెబుతోంది. అయితే రాష్ట్ర విభజన అనంతరం తాత్కాలిక సర్దుబాటులో భాగంగా కృష్ణా జలాలను (Krishna Water) 66:34 నిష్పత్తిలో పంచుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 299 టీఎంసీలు (34 శాతం) కేటాయింపుగా ఉంది. ఈ నిష్పత్తి శాస్త్రీయంగా లేదని, కనీసం 50:50 నిష్పత్తిలోనైనా రెండు రాష్ట్రాలకు సమానంగా నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ పట్టుబడుతోందని జేఏసీ పేర్కొంటోంది.

కేటాయింపులున్నా.. వాడుకోలేని దుస్థితి

రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలంగాణకు తాత్కాలికంగా కేటాయించిన 299 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవని జేఏసీ అంటోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు నిర్మించినప్పటికీ, అసంపూర్తి పనుల కారణంగా వాటికి పూర్తిస్థాయిలో నీటిని తరలించడం సాధ్యం కావడం లేదని పేర్కొంది. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తున్నామని గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. ప్రాజెక్టుల విషయంలో ఆచరణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని జేఏసీ విమర్శిస్తోంది. ప్రాజెక్టుల పనులు వేగంగా సాగకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొంటోంది.

ఎన్నికల నినాదాలుగా మారిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థం కావడం లేదని పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ ప్రశ్నిస్తోంది. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ నేతలు పెండింగ్‌ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతోనే ప్రజల ఆగ్రహానికి గురై ఓడిపోయారనే విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించాలని, పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో తాత్కాలికంగా కేటాయించిన 299 టీఎంసీల నీటిలో సగం కూడా వినియోగించుకోలేని దుస్థితి నెలకొందని జేఏసీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనలో వెయ్యి రోజులకు చేరువవుతున్నా.. పాలమూరు జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శిస్తోంది.

డిండి కంటే.. గొట్టిముక్కల లిఫ్ట్‌తో మేలు

జూరాల ఎగువ ప్రాంతం నుంచి నీటిని ఎత్తిపోసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని 2013 ఆగస్టులో పోరాడి సాధించిన జీవో నంబర్‌ 72 ప్రకారం పనులు చేపట్టకపోవడం దుర్మార్గమైన చర్య అని జేఏసీ ఆరోపిస్తోంది. అదేవిధంగా డిండి లిఫ్ట్‌ కోసం చేపడుతున్న పనులను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నల్లగొండ జిల్లాకు నీరు అందించే బదులు.. కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి గొట్టిముక్కల లిఫ్ట్‌ చేపట్టి నల్లగొండ జిల్లాను సాగునీటితో సస్యశ్యామలం చేయవచ్చని జేఏసీ వాదిస్తోంది.

2005లో పాలమూరు జిల్లాలో చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు లిఫ్ట్‌ పథకాల పనులను పూర్తి చేయడంతోపాటు, వాటికి నికర జలాలు సాధించాలని జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. జస్టిస్‌ బచావత్‌, రాజారావు కమిటీల సిఫార్సుల మేరకు నికర జలాల కేటాయింపులు ఉన్నప్పటికీ.. ఆర్డీఎస్‌, జూరాల, భీమా-1, భీమా-2, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకు నేలా ప్రాజెక్టులను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం, కృష్ణా జలాల్లో (Krishna Water) రాష్ట్రానికి న్యాయమైన వాటాను సాధించడం ద్వారానే పాలమూరు ప్రజల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జేఏసీ పేర్కొంటోంది.

Also Read : కొండా పోస్ట్ ఊస్ట్ .. AICC కీలక నిర్ణయం..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>