కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) అన్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.
బాలానగర్ మండలంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఫ్యూయలింగ్ గ్రోత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో ఎంపీ అరుణ,కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమై చాలామంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స కష్టతరమై ఖర్చులు కూడా పెరుగుతాయని తెలిపారు.
తొలిదశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించి వ్యాధిని నియంత్రించే అవకాశం ఉంటుందని ఎంపీ అరుణ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను కోరారు. స్క్రీనింగ్‌లో అనుమానిత కేసులను గుర్తించి, వారికి తదుపరి పరీక్షలు, చికిత్స అందేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు. అవసరమైన వారికి ప్రభుత్వ పథకాలు, ఉచిత లేదా తక్కువ ఖర్చుతో లభించే వైద్య సేవలపై అవగాహన కల్పించాలని అన్నారు.
మహిళలు రొమ్ము, గర్భాశయ ముఖద్వారం తదితర క్యాన్సర్ల లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని, ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఎంపీ అరుణ సూచించారు. బాలికలకు హెచ్‌పీవీ టీకాపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలని కోరారు. ఇంట్లో తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్న ఎంపీ, ప్రతి ఒక్కరూ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు, ఫ్యూయలింగ్ గ్రోత్ ఫౌండేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

