బీసీసీఐ బిగ్ రివ్యూ: గంభీర్, అగార్కర్, లక్ష్మణ్‌లకు పిలుపు!

కలం, స్పోర్ట్స్ :  విదేశీ గడ్డపై టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో బీసీసీఐ (BCCI)  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌(Gautam Gambhir), చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌(Ajit Agarkar), సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌లను (VVS Laxman) ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 3న నిర్వహించనున్న అత్యవసర సమీక్షా సమావేశంలో జట్టు వైఫల్యాలు, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఇటీవల ఎదుర్కొన్న వరుస పరాజయాలే ఈ సమీక్షకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2026 జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 2-0తో కోల్పోయింది. దీంతో గత మూడేళ్లుగా కొనసాగుతున్న 16 వరుస సిరీస్‌ల విజయపరంపరకు బ్రేక్‌ పడింది.

ఆ తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటనలోనూ భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌ 4-0తో, వన్డే సిరీస్‌లో 2-1తో ఓటమిపాలైంది. నాటింగ్‌హామ్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఏకంగా 125 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ వరుస ఓటములపై సమీక్ష నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా గతంలోనే వెల్లడించారు. అయితే సమావేశం నిర్వహణలో జాప్యానికి కారణాలను బోర్డు అధికారికంగా వెల్లడించలేదు.

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ దృష్టి

ప్రధానంగా ఆటగాళ్ల గాయాలు, వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ అంశాలపై బీసీసీఐ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కీలక అంతర్జాతీయ పర్యటనలకు ఆటగాళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంపై బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. జస్ప్రీత్‌ బుమ్రా మోకాలి గాయం కారణంగా శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌, సాయి సుదర్శన్‌ కూడా గాయాల సమస్యలను ఎదుర్కొన్నారు. బుమ్రా ఫిట్‌గా లేడన్న సమాచారం సెలక్షన్‌ కమిటీకి సకాలంలో అందకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్‌లో అధిక వర్క్‌లోడ్‌ కారణంగా కొందరు ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లకు పూర్తి ఫిట్‌నెస్‌తో హాజరుకావడం లేదనే అభిప్రాయం మేనేజ్‌మెంట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే అఫ్గానిస్థాన్‌ టీ20 సిరీస్‌ నేపథ్యంలో ఈ ఫిట్‌నెస్‌ సమస్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

సెప్టెంబర్‌ 9న ఫిట్‌నెస్‌ పరీక్షలు

బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణాలకు సెప్టెంబర్‌ 9న ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగానే జట్టు ఎంపిక చేపట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌పై కూడా బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వన్డేల్లో అతడు పరిమిత ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేయగలుగుతున్న నేపథ్యంలో అతడి పూర్తి ఫిట్‌నెస్‌ కీలకంగా మారింది.

అగార్కర్‌ కొనసాగుతారా?

మరోవైపు బీసీసీఐలో పరిపాలనా మార్పులపై కూడా సెప్టెంబర్‌ 3 సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ కాంట్రాక్ట్‌ ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 18న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అగార్కర్‌కు కాంట్రాక్ట్‌ పొడిగిస్తారా? లేక కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ను నియమిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వీవీఎస్‌ లక్ష్మణ్‌కు కొత్తగా ప్రతిపాదించిన ‘డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌’ బాధ్యతలు అప్పగించే అవకాశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వరుస పరాజయాలు, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌, సెలక్షన్‌ వ్యవస్థ వంటి కీలక అంశాలపై బీసీసీఐ సమీక్ష ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>