కలం, వెబ్ డెస్క్ : కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధిపై చర్చలు జరిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, మెరుగైన విమాన కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగానే కేంద్రమంత్రితో భేటీ అయినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాల పనులను వేగవంతం చేయడంపై చర్చించినట్లు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో టెర్మినల్, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్‌ఓ (MRO) సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు.
అలాగే ఆదిలాబాద్ విమానాశ్రయ రన్‌వే ఫైనలైజేషన్ కోసం రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం నిర్వహించే అంశంపైనా చర్చించినట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణలో హెలీ టూరిజం అభివృద్ధితో పాటు, హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో సీ ప్లేన్ ల్యాండింగ్ అవకాశాలను కూడా భేటీలో ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు. మెరుగైన విమాన కనెక్టివిటీ ద్వారా తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగానికి కొత్త ఊపు తీసుకురావడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read : రాష్ట్రంలో రాబోయేది వైఎస్సార్ యుగం.. రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Follow Us On: X(Twitter)

