కలం, ఖమ్మం బ్యూరో: గిరిజన యువతి శిరీష అత్యాచారం, హత్య ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం పోస్ట్‌ఆఫీస్ సెంటర్ నుంచి బస్టాండ్ అమరవీరుల స్థూపం వరకు విద్యార్థి సంఘాల నేతలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్‌కే ఫహీమ్ దాదా, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అజీత్ మాట్లాడారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లిన యువతి శవమై తిరిగిరావడం కలచివేసిందన్నారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, అత్యాచారాలను అరికట్టేందుకు చట్టాలను కటినంగా అమలు చేయాలన్నారు. హంతకుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనముల సాయి, ఎస్‌కే ఖయ్యూం పాల్గొన్నారు.

