కలం, మక్తల్ : రాష్ట్రంలో గత వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజల మేలు కోసం పొడిచింది ఏమీ లేదని, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను దోచుకొని తమ జేబులు నింపుకుంటున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బుధవారం మక్తల్ (Makthal) లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.
ఈ సందర్భంగా స్థానిక నల్లజానమ్మ ఆలయం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌరస్తా వరకు వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ (BRS Rally) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమైందని ఆయన అన్నారు.
మక్తల్ నియోజకవర్గంలో ఎవరూ చేయని అభివృద్ధిని తన హయాంలో చేసి చూపెట్టామని ఆయన అన్నారు. సంగం బండ, భూత్పూర్ జలశయాల నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. అయితే గత వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మొత్తం కేవలం కాగితాలకే పరిమితమైందని చిట్టెం (Rammohan Reddy) విమర్శించారు. రైతు భరోసా ఎగ్గొట్టడంతో పాటు రైతు బీమా పథకానికి కాంగ్రెస్ పార్టీ మంగళం పాడిందని ఆరోపించారు.
మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు తులం బంగారం కలిపి ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. రైతాంగానికి బీఆర్ఎస్ పాలనలో 24 గంటలపాటు నాణ్యమైన కరెంటును ఉచితంగా అందించామని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎనిమిది నుంచి పది గంటలు కూడా కరెంట్ సక్రమంగా ఉండడం లేదన్నారు. దీంతో పంటలు ఎండిపోయి రైతులు దీనస్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు మళ్లీ మంచి రోజులు రావాలంటే కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విస్తృతంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహ గౌడ్, నాయకులు మహిపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి, చిన్న హనుమంతు, రుద్రసముద్రం రామలింగం, నరసింహారెడ్డి, శివారెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : రాష్ట్రంలో రాబోయేది వైఎస్సార్ యుగం.. రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Follow Us On : WhatsApp

