కలం, స్పోర్ట్స్: దులీప్ ట్రోఫీ (Duleep Trophy) టోర్నీలో సౌత్ జోన్ తుది సమరానికి అర్హత సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో నార్త్ జోన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ 195 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma) అద్భుత శతకంతో (116 పరుగులు) జట్టును ఆదుకున్నాడు. శ్రేయస్ గోపాల్ (87 పరుగులు)తో కలిసి ఆరో వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
దీంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసి 117 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ 297 పరుగులకు ఆలౌటైంది. సనత్ సంగ్‌వాన్ 76, ఆయుష్ దోసేజా 52 పరుగులతో పోరాడారు. సౌత్ జోన్ బౌలర్ ఎండీ నిధీష్ 5 వికెట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో సౌత్ జోన్ ముందు 181 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఛేజింగ్‌లో సౌత్ జోన్ ఓపెనర్లు రికీ భుయ్ (42), నారాయణ్ జగదీసన్ (43) మంచి ప్రారంభాన్ని అందించారు.
ఆ తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma) బాధ్యతాయుతంగా ఆడి నాటౌట్‌గా 51 పరుగులు చేశాడు. అర్ధ సెంచరీతో పాటు ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆర్ స్మరణ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు విడదీయరాని 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ విజయంతో సౌత్ జోన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెప్టెంబర్ 6 నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది.
Also Read : ఫ్యాన్స్ దెబ్బకు హాంప్‌షైర్ యూటర్న్.. కుగ్గెలెయిన్ ఔట్
Follow Us On: X(Twitter)

