కలం, నిర్మల్: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జన్మదిన వేడుకలను నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. జనసేనాని జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రక్తదానం ద్వారా అత్యవసర సమయంలో అవసరమైన వారికి సహాయం అందించవచ్చని పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.

