డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలపై జాగ్రత్త: సీఐ భాస్కర్‌

కలం, యాదగిరిగుట్ట: సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యాదగిరిగుట్ట పట్టణ సీఐ (Yadagirigutta CI) బొడ్డుపల్లి భాస్కర్‌ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ భాస్కర్‌ మాట్లాడుతూ ప్రజలు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు, టెలికాం సిబ్బంది పేరుతో ఫోన్‌ చేసి ఓటీపీ, ఏటీఎం పిన్‌, బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సూచించారు. వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యోగాలు, బహుమతులు, లోన్ల పేరుతో గుర్తుతెలియని లింకులు పంపించి డబ్బులు దోచుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాంటి అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేయవద్దని సూచించారు.

డిజిటల్‌ అరెస్టు పేరుతో మోసాలపై జాగ్రత్త

ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు డిజిటల్‌ అరెస్టు పేరుతో ప్రజలను భయపెట్టి నగదు బదిలీ చేయిస్తున్నారని సీఐ తెలిపారు. ఎవరైనా ఫోన్‌ చేసి బ్యాంకు ఖాతా నిలిచిపోతుందని, పోలీసు కేసు నమోదైందని బెదిరించినప్పుడు భయపడకుండా సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించాలని సూచించారు. ఓటీపీ, పాస్‌వర్డ్‌, ఏటీఎం పిన్‌ వంటి కీలక సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదని తెలిపారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సంబంధిత సైబర్‌ క్రైమ్‌ విభాగానికి సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్‌ నేరాలను చాలా వరకు అరికట్టవచ్చని సీఐ పేర్కొన్నారు. సదస్సులో సైబర్‌ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతో పాటు ప్రజల సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు యాదయ్య, ప్రసాద్‌, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>