ప్రతిపక్ష గొంతును అణచివేయడం అప్రజాస్వామ్యం : మేఘారెడ్డి

కలం, వనపర్తి: ప్రజాసమస్యలపై గళమెత్తుతున్న ప్రతిపక్ష గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) అన్నారు. రాహుల్‌గాంధీపై నమోదైన కేసుకు నిరసనగా మంగళవారం వనపర్తి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ చీఫ్‌ శివసేనారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శివాసేనారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ, అసహన వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్‌గాంధీపై ఉత్తరాఖండ్‌లో నమోదు చేసిన కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రజల సమస్యలపై ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడతారా? అని బీజేపీ ప్రభుత్వాన్ని డిసిసి చీఫ్ శివసేనారెడ్డి ప్రశ్నించారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఘటనపై ప్రశ్నించిన రాహుల్‌గాంధీపైనే కేసు నమోదు చేయడం ఏమిటని నిలదీశారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాన్ని రాజకీయ శత్రువుగా కాకుండా ప్రజాస్వామ్యంలో కీలక భాగస్వామిగా చూడాలని సూచించారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లు, బెదిరింపులతో రాహుల్‌గాంధీ గొంతును అణచలేరని, కాంగ్రెస్‌ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

‘మోదీ దేశానికి చేసిందేమీ లేదు’

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించిన వారిపై పార్లమెంట్‌ సాక్షిగా చర్యలు తీసుకోవాలని ప్రశ్నిస్తే, ప్రశ్నించే వారిపైనే అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శించారు. రాముడి పేరు, అక్షింతల పేరుతో దేశ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. రెండు సిలిండర్లపై నడుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం కాంగ్రెస్‌ పార్టీ చేసిందని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ దేశానికి చేసిందేమీ లేదని, ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకే బీజేపీ పరిమితమైందని ఆయన ఆరోపించారు. రాహుల్‌గాంధీని దేశ ప్రధానమంత్రిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, సాయి చరణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మం, చీర్ల జనార్దన్‌, సాగర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మాధవి, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్‌, కౌన్సిలర్లు ధనలక్ష్మి, విజయలక్ష్మి, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఆదిత్యతో పాటు వివిధ మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>