కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు (Peddakandukur) గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ వార్డు సభ్యుడు శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై డివిజనల్ పంచాయతీ అధికారి (DPO) శ్రీకాంత్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సమగ్రంగా విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారు శ్రీనివాస్‌తో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులతో సమావేశమైన డీపీవో.. పలు ఫైళ్లు, రికార్డులు, గ్రామపంచాయతీ సమావేశాల్లో చేసిన తీర్మానాలను పరిశీలించారు. ఫిర్యాదులో పేర్కొన్న పది అంశాలపై పాలకవర్గం సభ్యులతో చర్చించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తనిఖీ అనంతరం డీపీవో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. గ్రామపంచాయతీలోని అన్ని రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి విచారణ కొనసాగిస్తామని చెప్పారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లభిస్తే నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
గ్రామంలో ప్రతిరోజూ చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని పాలకవర్గ సభ్యులకు డీపీవో సూచించారు. వార్డుల వారీగా బ్లీచింగ్ పౌడర్ వినియోగించాలని, కాలువల్లో ఎప్పటికప్పుడు పూడిక తొలగించాలని ఆదేశించారు. మురుగునీరు నిలిచే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులలో గ్రామపంచాయతీ నిధులను నిబంధనల మేరకు వినియోగించుకోవచ్చని డీపీవో తెలిపారు. సంబంధిత బిల్లులకు సంబంధించిన నిధుల వినియోగాన్ని తదుపరి పాలకవర్గ సమావేశంలో ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవచ్చని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై పాలకవర్గం నిరంతరం దృష్టి సారించాలని ఆయన సూచించారు.

