కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మేన కోడలు బ్రిస్టి ముఖర్జీ (Bristi Mukherjee) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిర్భూమ్ జిల్లాలోని రాంపుర్హట్లో నివాసం ఉంటున్న బ్రిస్టి ముఖర్జీ తన ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాంపుర్హట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. తన మేడ కోడలి ఆత్మహత్యపై మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రిస్టి మరణం తనను షాక్కు గురి చేసిందన్నారు.
ఆత్మహత్యకు అదే కారణమా..?
బ్రిస్టి ముఖర్జీ (Bristi Mukherjee) ఆత్మహత్యకు పలు కారణాలున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎప్పటి నుంచో ఆమె భర్త నుంచి విడిగా ఉంటున్నారని.. విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టులో ఆ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని.. అందుకు సంబంధించి చికిత్స కూడా తీసుకుంటోందని వివరించారు. మరోవైపు మమత హయాంలో జరిగిన టీచర్ల రిక్రూట్మెంట్ను సుప్రీం కోర్ట్ రద్దు చేసింది. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోగా.. వారిలో బ్రిస్టి ముఖర్జీ కూడా ఒకరు. కొన్ని నెలలుగా ఇంటికే పరిమితం కావడంతో ఒంటరితనం ఆత్మహత్యకు కారణమై ఉంటుందా.. అనే చర్చ కూడా జరుగుతోంది.
Also Read : చంపేస్తామంటూ కేంద్రమంత్రికి బెదిరింపు లేఖ
Follow Us On : WhatsApp

