కలం, మహబూబ్ నగర్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 4న నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ (CM Principal Secretary Sridhar) మంగళవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తో కలిసి మద్దూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులు, హెలిప్యాడ్ ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ముందుగా మద్దూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం చింతల్‌దిన్నె మార్గంలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల,కళాశాల నిర్మాణ ప్రాంగణంలో భవన నిర్మాణానికి సంబంధించిన మ్యాప్, పనుల టైమ్‌లైన్‌తో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి మార్చి నెలలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. మద్దూరు సమీపంలోని డిగ్రీ కళాశాల భవనం వద్ద ఒక స్థలంతో పాటు చింతల్‌దిన్నె సమీపంలోని మరో స్థలాన్ని పరిశీలించి, హెలిప్యాడ్ ఏర్పాటుకు అవసరమైన భద్రతా, సాంకేతిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ అధికారులను ఆదేశించారు.

