కలం, కరీంనగర్ బ్యూరో: భద్రత, భరోసా లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని కరీంనగర్ ఉద్యోగుల జేఏసీ (Employees JAC) చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్ గౌడ్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీని ‘పెన్షన్ విద్రోహ దినం’గా పాటిస్తూ కరీంనగర్‌లో ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెన్షన్ అనేది ఎవరి దయాదాక్షిణ్యం కాదని, అది ఉద్యోగి హక్కు అని స్పష్టం చేశారు.
ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం..
2004 తర్వాత చేరిన ఉద్యోగుల భవిష్యత్తును షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులకు వదిలేయడం సామాజిక న్యాయానికి విరుద్ధమని విమర్శించారు. పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టానికి తగిన సవరణలు చేసి, 2004 తర్వాత చేరిన అందరికీ ఓపీఎస్ వర్తింపజేయాలని, జీపీఎఫ్ ఖాతాలు కేటాయించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
చేతగానితనంగా భావించవద్దు..
ఉద్యోగుల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని, డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో TSCPSEU రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, ఎడ్ల అరవింద్ రెడ్డి, పెన్షనర్ల సంఘం నాయకులు కేశవరెడ్డి, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మీందర్ సింగ్, మారుపాక రాజేష్ భరద్వాజ్, సుమంత్ రావు, శారద, సునీత, పెద్ద సంఖ్యలో ఉద్యోగ సంఘాల (Employees JAC) నాయకులు పాల్గొన్నారు.
Also Read : కళ్యాణ లక్ష్మిపై స్టే ఎత్తివేత.. మంత్రి పొన్నం హర్షం
Follow Us On: X(Twitter)

