కళ్యాణ లక్ష్మిపై స్టే ఎత్తివేత.. మంత్రి పొన్నం హర్షం

కలం, కరీంనగర్ బ్యూరో: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి సింగిల్ బెంచ్ విధించిన స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హర్షం వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచే కళ్యాణ లక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అర్హులైన కుటుంబాలకు ఈ పథకాల ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. స్టే కారణంగా పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అర్హత ఉన్న ఒక్క లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

ప్రజల్లో గందరగోళం సృష్టించారు..

కోర్టు విధించిన స్టేను విధించినపుడు కొందరు రాజకీయ కోణంలో చూస్తూ, పథకాలు రద్దు అయినట్లుగా ఎందుకు భావిస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వక్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు కలిగే అంశాలు తలెత్తినప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు ఎందుకు అంత సంతోషం కలుగుతుందని మంత్రి ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందన్నారు.

పేద వర్గాలకే అత్యంత ప్రాధాన్యం..

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>