కలం, వెబ్ డెస్క్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు పథకాలపై గతంలో కాగ్ సునిశిత పరిశీలన చేసిందని.. ఆ సంస్థ ఎలాంటి అభ్యంతరం తెలపనందున వీటిని కొనసాగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. హైకోర్ట్ తీర్పుతో ఇక నుంచి రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ తిరిగి ప్రారంభం కానుంది. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన 18 ఏళ్లు దాటిన అమ్మాయిలు వివాహం చేసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,00,116 మంజూరు చేస్తుంది. మైనార్టీ వర్గాలకు షాదీ ముబారక్ అమలవుతోంది.
అభ్యంతరం ఎందుకు..?
కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన కోర్ట్.. పలుమార్లు ప్రభుత్వాన్ని ఆదేశించినా కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో ఆగస్ట్ 12న ఈ పథకాల అమలుపై స్టే విధించింది. దీనిపై బీఆర్ఎస్ ఆందోళనలు చేయడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. కౌంటర్ దాఖలు చేసింది. సోమవారం నాడు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్వయంగా వాదనలు వినిపించారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఈ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. వీటి వలన పిటిషన్ దారుడికి ఎలాంటి నష్టం, లాభం లేదని.. అయినా అభ్యంతరం ఎందుకు అని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనల అనంతరం డివిజన్ బెంచ్ స్టే ఎత్తేసింది.
Also Read : తెలంగాణలో చాణక్య స్ట్రాటజీస్ సర్వే.. షాకింగ్ రిపోర్ట్!
Follow Us On: Youtube

