కలం, కరీంనగర్: సంకటహర చతుర్థి (Sankatahara Chaturthi) సందర్భంగా కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గణనాథుడికి విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.
సంకటహర చతుర్థి సందర్భంగా కరీంనగర్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగి, కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

