కలం, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట (Dammapeta) మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి ఊకె శిరీష మృతి చెందిన ఘటనపై మహిళా సంఘాలు, ఆదివాసీ నాయకులు ఆందోళన నిర్వహించాయి. ఆమె మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శిరీష ఆత్మకు శాంతి చేకూరాలని దమ్మపేట మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహిళలపై దాడులు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని ఆరోపించారు.
దిశ ఘటనను ప్రస్తావిస్తూ.. శిరీష మృతికి కారణమైన వారిపై కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దమ్మపేట సర్పంచి పగడాల రమాదేవి, మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు , పొట్ట నాగమణి , వట్టం దుర్గా, దారా రాణి , కారం శారద , ఆశా కార్యకర్తలు, మహిళా సంఘ నాయకురాలు జాన్ బి, ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి పాల్గొన్నారు.

