రాహుల్‌పై కేసు.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో: దళితులపై జరుగుతున్న వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా గళం వినిపించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం బీజేపీ అహంకార, నిరంకుశ వైఖరికి నిదర్శనమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులపై రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే.. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రశ్నించిన నేతపైనే కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా అంటరానితనం, కుల వివక్షను నిర్మూలించలేరని స్పష్టం చేశారు.

బాధితుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించిన వారినే నిందితులుగా చిత్రీకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అంటరానితనాన్ని రాజ్యాంగం ద్వారా నిర్మూలించడం నుంచి ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టాల రూపకల్పన వరకు సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా పోరాడిందని గుర్తుచేశారు. దళితులపై వివక్షను నిర్మూలించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న నిర్దిష్ట చర్యలేమిటో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

అంటరానితనం నిర్మూలన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ చేపట్టిన ఉద్యమాలు, చేసిన పోరాటాలు ఏమిటో కూడా ప్రజలకు వివరించాలని సవాల్‌ విసిరారు.బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలైన సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. దళితుల హక్కులు, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>