కలం, ఖమ్మం బ్యూరో: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతి దేవుడి ముందు ఒట్టు వేసి మరీ హామీలిచ్చారని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) విమర్శించారు. తీరా అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ రెండో తేదీ నుండి 8వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ మేరకు కొత్తగూడెంలోని తెలంగాణ భవన్‌లో సోమవారం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు అధ్యక్షతన పార్టీ శ్రేణుల విస్తృత సమావేశం జరిగింది.
కొత్తగా అభివృద్ధి లేదు..
ఈ సమావేశంలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 432 హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 1000 రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయన్నారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కొత్తగా ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికీ విడమర్చి చెబుతూ సెప్టెంబర్ 2 నుంచి జరిగే నిరసన కార్యక్రమాల్లో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజా వ్యతిరేక విధానాలపై రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కాపు సీతామహాలక్ష్మి, వేల్పుల దామోదర్, మాజీ ఎంపీపీలు, కార్పొరేటర్లు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

