కలం, నిర్మల్ : శ్రావణ సోమవారం సందర్భంగా పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఆ కుటుంబాల్లో తిరుగు ప్రయాణం తీరని విషాదాన్ని మిగిల్చింది. దేవుడిని దర్శించుకుని ఆనందంగా స్వగ్రామానికి బయలుదేరిన కొద్దిసేపటికే జీపు అదుపుతప్పి బోల్తాపడటంతో ఒకే గ్రామానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ (Nirmal) జిల్లా కుభీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన 11 మంది శ్రావణ సోమవారం సందర్భంగా మహారాష్ట్రలోని కైలాష్ టెకిడి పుణ్యక్షేత్రానికి వెళ్లారు.
పూజలు ముగించుకుని జీపులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. గ్రామానికి చేరువవుతున్న సమయంలో మహారాష్ట్ర సరిహద్దులో జీపు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ తులసిరాం పటేల్ (27), తూము సాయిలు (65), ఆవులొల్ల గంగాధర్ (64), తూము గౌరబాయి (75) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాద వార్త తెలియగానే పార్డి (బి) గ్రామంలో విషాదం అలుముకుంది. పుణ్యక్షేత్రానికి వెళ్లిన తమవారు తిరిగి వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు నలుగురు మృతి చెందిన విషయం తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటన స్థలంలో కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

