దమ్మపేటలో ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్.. లోడుతో సహా ట్రాక్టర్ సీజ్!

కలం, ​దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అటవీ డివిజన్ పరిధిలోని దమ్మపేట ( Dammapeta ) అటవీ రేంజ్‌లో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిఘా తీవ్రతరం చేసిన అటవీ శాఖ సిబ్బంది, పాకాలగూడెం నుండి తిరుమలకుంటకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను లోడుతో సహా సీజ్ చేశారు.

​అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలకుంట వద్ద రాత్రి వేళ ప్రత్యేక గస్తీ నిర్వహిస్తుండగా, అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను అటవీ సిబ్బంది తనిఖీ కోసం నిలిపారు. ఇసుక రవాణాకు సంబంధించిన అవసరమైన అనుమతులు గానీ, పత్రాలు గానీ లేకపోవడంతో సదరు వాహనాన్ని అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ అక్రమ రవాణా ఘటనపై సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి విచారణ జరుపుతున్నారు.

దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె. శ్రీను మాట్లాడుతూ.. అటవీ డివిజన్ పరిధిలో సహజ వనరులు, అటవీ సంపద అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టుల వద్ద నిరంతరం వాహన తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచి దాడులు తీవ్రతరం చేస్తామని తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>