కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ (BRS Protest) పార్టీ కార్యాచరణకు సిద్ధమైంది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే వాటి అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, వృద్ధులు, వికలాంగులు సహా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. అమలు కాని హామీలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నిరసన కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
నిరసన కార్యక్రమాల షెడ్యూల్
సెప్టెంబర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్‌షీట్ విడుదల.
సెప్టెంబర్ 2: ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలపై నిరసనలు.
సెప్టెంబర్ 3: వ్యవసాయం, రైతుల సమస్యలు, సాగునీరు, భూ సమస్యలపై నిరసనలు.
సెప్టెంబర్ 4: మహిళలు, వృద్ధులు, వికలాంగులు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమస్యలపై కార్యక్రమాలు.
సెప్టెంబర్ 5: విద్యార్థులు, యువత, ఉద్యోగ అవకాశాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపై నిరసనలు.
సెప్టెంబర్ 6: నియోజకవర్గాల వారీగా ప్రజా సమస్యలపై ర్యాలీలు, నిరసనలు, సదస్సులు.
సెప్టెంబర్ 7: కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపై ప్రజల్లో చర్చలు, నిరసనలు.
సెప్టెంబర్ 8: జిల్లా కేంద్రాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను వెల్లడించడం.
కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల, పట్టణ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని రామకృష్ణారావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

