నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ పోరుబాట.. కాంగ్రెస్ హామీలే టార్గెట్

కలం, నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాగర్‌కర్నూల్ (Nagarkurnool)  నియోజకవర్గంలో బీఆర్ఎస్ సమరశంఖం (BRS Protest) పూరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఏడు రోజుల పాటు నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందన్నారు. అయితే ఇప్పటివరకు హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు? ఎన్ని అమలు చేయలేదు? అమలు కాని హామీల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అనే అంశాలను ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. అధికారిక గణాంకాలను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. ప్రతి రోజు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ హామీలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>