కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ (NEET Paper Leak) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ నుంచి వివరాలను సేకరిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది.పేపర్ లీక్ వెనుక జరిగినట్లు అనుమానిస్తున్న అక్రమ ఆర్థిక లావాదేవీలు, నగదు చేతులు మారిన తీరుపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు నీట్ యూజీ పేపర్ లీక్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులు, ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తు, నిందితుల పాత్ర తదితర వివరాలను ఈడీ కోరినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌తో పాటు కేసులో కీలకంగా ఉన్న పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఈడీ పరిశీలిస్తోంది.
పేపర్ లీక్ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు అనుమానాలున్నాయి. ఈ కేసులో 13 మంది నిందితులకు సంబంధించిన ఛార్జిషీట్ వివరాలు, సాక్షుల వాంగ్మూలాలతో పాటు కీలక పాత్రలకు ఈడీకి సీబీఐ అందజేసినట్లు తెలుస్తోంది. దీంతో నీట్ పేపర్ విక్రయాల ద్వారా చేతులు మారిన నగదు, హవాల లింకులపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందా? అక్రమంగా సంపాదించిన డబ్బును ఇతర మార్గాల్లోకి మళ్లించారా? అనే కోణాల్లో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

