కలం, వెబ్‌డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఇటీవల విడుదలైన టాక్సిక్ (Toxic) సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా వైరల్ అవుతోందని రాజా సింగ్ అన్నారు. ఈ మూవీ హీరో యశ్ గతంలో కేజీఎఫ్‌తో మంచి పేరు సంపాదించారని, ప్రొడ్యూసర్లకు డబ్బు కూడా బాగా వచ్చిందని అన్నారు. అదే కాన్సెప్ట్‌తో టాక్సిక్ కూడా తీశారని అన్నారు. తన స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లానని, సినిమా పూర్తవకముందే మధ్యలోనే వచ్చేశానని చెప్పారు. మూవీలో సబ్జెక్ట్ కంటే అశ్లీలత ఎక్కువ ఉందని రాజాసింగ్ అన్నారు. తన స్నేహితులతో కలిసి చూసేందుకు కూడా ఇబ్బందికరంగా అనిపించిందన్నారు.
గతంలో సినిమాల్లో మంచి కథలు ఉండేవని, నేర్చుకోవడానికి మంచి విషయాలు ఉండేవని రాజా సింగ్ అన్నారు. ఇప్పుడు తీస్తున్న సినిమాలు కరప్షన్, డబ్బులు, డ్రగ్స్, నరకడం, చంపడం గురించే ఉంటున్నాయన్నారు. దీంతో సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుందో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆలోచించాలన్నారు. అలాగే ఏదైనా మూవీ ఒప్పుకునే ముందు హీరోలు కూడా ఆలోచించాలని కోరారు. ఈ టాక్సిక్ మూవీ 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే చూడాలని సినిమా వాళ్లు ముందే చెప్పారని గుర్తు చేశారు. అంటే టాక్సిక్ సినిమా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
ఇక రవితేజ కొత్త సినిమా ఇరుముడి పైనా రాజా సింగ్ స్పందించారు. ఇరుముడిలో మంచి సబ్జెక్ట్ ఉందని అన్నారు. ధర్మం పట్ల, భక్తి పట్ల మంచి మెసేజ్ ఇచ్చారన్నారు. ఆ సినిమా తానూ చూశానని వెల్లడించారు. గతంలో చావా మూవీ కూడా వచ్చిందని, నాలుగు సార్లు ఆ సినిమా చూశానని చెప్పారు. అందరినీ ఆ సినిమా చూడాలని కూడా చెప్పానన్నారు. తన వల్ల మరో మూడు నాలుగు వేల మంది ఆ సినిమా చూశారన్నారు. తన ఫ్యామిలీ, కార్యకర్తలతో కలిసి అప్పుడప్పుడు సినిమాలు చూస్తానని రాజా సింగ్ అన్నారు. ఇక టాక్సిక్ సినిమాను ఎవరికి రికమెండ్ చేసే పరిస్థితి లేదని తెలిపారు. ఈ సినిమాను ప్రచారం చేయాలన్నా తన మనసు ఒప్పుకోవడం లేదన్నారు. సబ్జెక్ట్ లేని మూవీ అని, నరకడం, చంపడం, అశ్లీలత తప్ప అందులో ఏమీ లేవని విమర్శించారు. సినిమాలు తీస్తే ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా తీయాలని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలకు రిక్వెస్ట్ చేశారు.

