ఉమ్మడి కరీంనగర్‌లో కాంగ్రెస్ సంస్థాగత సమరం

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కావస్తున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ రాజకీయం తీవ్ర ఉత్కంఠకు, ఊహాగానాలకు వేదికగా మారింది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పీసీసీ సంస్థాగత నియామకాలపై దృష్టి సారించగా మరోవైపు మూడేళ్లుగా నామినేటెడ్ పదవులు దక్కక ద్వితీయ శ్రేణి నాయకత్వం, సీనియర్ కార్యకర్తలు తీవ్ర నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో నెలకొన్న అసంతృప్తికి తెరదించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అయినప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు కొనసాగుతుండగా.. క్షేత్ర స్థాయిలో పదవుల సెగతో  తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.

పీసీసీ ‘మిషన్ 31’.. సంస్థాగత కమిటీల భర్తీకి కసరత్తు

పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అసంతృప్తికి తెరదించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. వాయిదా పడుతూ వస్తున్న మండల, డివిజన్, పట్టణ కమిటీల భర్తీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  అందుకు  కరీంనగర్ జిల్లా కమిటీల పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా ఖాజా ఫక్రుద్దీన్‌లను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.  ఈ నెల 31వ తేదీ నాటికి కమిటీల జాబితాను పూర్తి చేసి పరిశీలకులకు అందజేయాలని కమిటీ అధ్యక్షులను పీసీసీ ఆదేశించింది.

కమిటీల్లో సామాజిక సమీకరణాలు..

ప్రతి కమిటీలో కనీసం 21 మందికి అవకాశం కల్పించాలని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు 33 శాతం (కనీసం 7 నుండి 8 మంది) మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని షరతు విధించారు. కాగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 500 మంది మహిళా నాయకులను కమిటీల్లోకి తీసుకోవడం స్థానిక నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇది పట్టణ, డివిజన్ ప్రాంతాల్లోనూ కనబడుతోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటం, ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు కూడా అధికారిక నిబంధనలకే పరిమితమవుతుండటంతో ఈ లక్ష్యం ఏమేరకు సాధ్యమవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

నాయకులకు పదవుల పంట.. కార్యకర్తలకు మొండిచేయి!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. పెద్ద నాయకులందరికీ పదవులు వరించినప్పటికీ, జెండా మోసిన కార్యకర్తకు మాత్రం తగిన గుర్తింపు దక్కలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, విప్ లుగా ఆది శ్రీనివాస్ప్రభుత్వ , విజయ రమణారావులు, ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే, రాష్ట్ర SC సెల్ అధ్యక్షుడుగా కవ్వంపల్లి సత్యనారాయణలకు పదవులు లభించాయి. పెద్ద నేతల అనుచరులు, పైస్థాయి నాయకులు ఉన్నత పదవుల్లో కొలువుదీరినా పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని, కేసులు ఎదుర్కొన్న ద్వితీయ శ్రేణి నాయకులకు మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్లు, ఆలయ కమిటీల పదవులు దక్కకపోవడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

పెల్లుబుకుతున్న అసంతృప్తి

మూడేళ్లుగా దరఖాస్తులు, వడపోతలు, పోలీస్ వెరిఫికేషన్ల పేరిట కాలయాపన చేస్తున్నారనే ఆగ్రహం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.  కష్టకాలంలో నిలబడిన సీనియర్లను పక్కనబెట్టి, డబ్బు మూటలు, పైరవీలు, బంధుప్రీతితో కొత్తగా పార్టీలోకి వచ్చిన పారాచూట్ నాయకులకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేవలం అధికారిక సమీక్షలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయి కార్యకర్తలను పట్టించుకోవడంలేదని స్థానిక నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లోనూ సమన్వయం లోపించిందని లోకల్ లీడర్లు గుర్రుగా ఉన్నారు.

కార్యకర్తలకు మొండి చేయిపై అసహనం..

మరోవైపు జిల్లా మంత్రులు తమ కార్యకర్తలకు అసలు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల జిల్లా నుంచి అత్యధిక ఎమ్మెల్యేలను అందించినా కూడా కార్యకర్తలకు మొండిచేయి చూపిస్తుండటంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇటీవల సుదీర్ఘకాలం పార్టీకి సేవ చేసిన సీనియర్ నేత ఎస్.ఎల్. గౌడ్ మరణం శ్రేణులను మరింత కలచివేసింది. జీవితకాలం పార్టీ కోసం పనిచేసిన వారికే గుర్తింపు లేకపోతే  క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసే సంస్కృతికి కాలం చెల్లినట్లేనా అని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.

రాబోయే ఎన్నికలపై ప్రభావం పడేనా?

ఇప్పటికే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ అధ్యక్షుడిగా అంజన్ కుమార్ మాత్రమే బాధ్యతల్లో ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ పోరు నాటికి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని సమాయత్తం చేయకపోతే పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని, కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నిజమైన అంకితభావం ఉన్న సీనియర్ కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>