శిరీషది ఆత్మహత్యా? హత్యా? నిజాలు నిగ్గు తేల్చాలి: మాజీ ఎమ్మెల్యే

​కలం, ఖమ్మం బ్యూరో: హైదరాబాద్‌లోని తుక్కుగూడ వద్ద ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆదివాసి యువతి శిరీషది ఆత్మహత్యా? లేక హత్య చేసి మభ్యపెడుతున్నారా? అనే కోణంలో ప్రభుత్వం నిజాలను నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు (Tati Venkateswarlu) గట్టిగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటుగూడెం గ్రామానికి చెందిన శిరీష అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర విచారం, ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ఉపాధి వెతుక్కుంటూ స్వగ్రామాన్ని వదిలి నగరానికి వెళ్లిన ఆదివాసి యువతి విధి నిర్వహణలో ఉండగానే అనుమానాస్పదంగా మృతి చెందడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని తాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మృతికి దారితీసిన పరిస్థితులపై నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరపాలని కోరారు. ఘటనకు ముందు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ దర్యాప్తులో ఎవరైనా బాధ్యులుగా తేలితే ఎంతటి వారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

​ఉద్యోగం కోసం వెళ్లిన మహిళలు, యువతులకు పనిచేసే ప్రాంతాల్లో రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే ఎలా? అని తాటి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. స్వగ్రామాలకు దూరంగా వెళ్లి ఉద్యోగాలు చేసుకునే మహిళల భద్రతకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉన్న శిరీష కుటుంబ సభ్యుల అనుమానాలు నివృత్తి అయ్యే వరకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వారికి తగిన న్యాయంతో పాటు తక్షణ ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>