కలం, మహబూబ్నగర్ బ్యూరో: విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఇక జెన్ జీ ఎంత మాత్రం నిశ్శబ్దంగా ఉండదని ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి ఐషి ఘోష్ (Aishe Ghosh) అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం “జెన్ జీ ఇక నిశ్శబ్దంగా ఉండదు” అనే అంశంపై విద్యార్థుల కోసం ప్రత్యేక సెమినార్ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి ఐషి ఘోష్ హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఐషి ఘోష్ మాట్లాడుతూ.. నేటి యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మౌనంగా ఉండకుండా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన విద్యార్థులు తమ చుట్టూ జరుగుతున్న సామాజిక, విద్యా, ఆర్థిక పరిణామాలను అర్థం చేసుకోవడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
“జెన్ జీ ఇక నిశ్శబ్దంగా ఉండదు”
“జెన్ జీ ఇక నిశ్శబ్దంగా ఉండదు” అనే నినాదం కేవలం ఒక కార్యక్రమానికి సంబంధించిన అంశం కాదని, విద్యార్థులు తమ హక్కుల కోసం గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరాన్ని తెలియజేసే ఉద్యమ పిలుపు అని పేర్కొన్నారు. విద్య ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండాల్సిన ప్రాథమిక హక్కు అయినప్పటికీ, నేటి పరిస్థితుల్లో విద్యా రంగంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆమె అన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు, హాస్టల్ సౌకర్యాలు, స్కాలర్షిప్లు, పుస్తకాలు, యూనిఫారాలు తదితర సదుపాయాలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హక్కుల కోసం ఉద్యమించాలి..
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సంస్థ ఎస్ఎఫ్ఐ అని అన్నారు. విద్యార్థులు తమ సమస్యలను వ్యక్తిగత సమస్యలుగా కాకుండా సమాజ సమస్యలుగా చూడాలని, హక్కుల కోసం సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి అవసరమైన నిధులను పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య చైతన్యం పెరగాలి..
ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సమాజంపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. యువతలో ప్రశ్నించే ఆలోచన, శాస్త్రీయ దృక్పథం, ప్రజాస్వామ్య చైతన్యం పెరగాలని పేర్కొన్నారు. విద్యార్థుల గొంతును అణచివేయడం కాకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి..
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ మాట్లాడుతూ.. మహబూబ్నగర్ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని అన్నారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల కొరత, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల లోపం, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సిబ్బంది కొరత వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని వక్తలు పిలుపునిచ్చారు. యువతలో ఉన్న సృజనాత్మకత, ప్రశ్నించే శక్తి, సామాజిక బాధ్యత దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా విద్యా వ్యవస్థ ఉండాలని అన్నారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించేందుకు, విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
“ప్రశ్నించే విద్యార్థి సమాజానికి బలం.. నిశ్శబ్దంగా ఉండే విద్యార్థి సమస్యలకు పరిష్కారం పొందలేడు” అనే సందేశంతో సెమినార్ కొనసాగింది. విద్యార్థులు తమ హక్కుల కోసం ఐక్యంగా నిలబడాలని, విద్యా రంగంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సెమినార్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్ భరత్ నాయకులు, నందు, జ్ఞాపిక, తారా సింగ్, పవన్, మల్లేష్ తదితరులు కార్యకర్తలు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

