కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ను లూటీ చేసేందుకే కాంగ్రెస్ ‘క్యూర్’ పేరుతో కుట్ర చేస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్.రాంచందర్ రావు (Ramchander Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ చట్టాన్ని మార్చి కొత్తగా ‘కోర్ అర్బన్ రీజియన్’ (CURE) పేరుతో తీసుకొస్తున్న విధానం ప్రజలకు ఒక శాపం (Curse) లా మారబోతోందని ఆయన హెచ్చరించారు.
క్యూర్ ద్వారా మొత్తం పెత్తనాన్ని సీఎం తన గుప్పిట్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విధానం ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారీగా పన్నుల భారం పడనుందని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు రేవంత్ రెడ్డి సర్కార్ నిరంకుశ చర్యలను చూసి ప్రజలు భయపడే దుస్థితి వచ్చిందని విమర్శించారు. అధికారం రాగానే హైడ్రా (HYDRAA) పేరుతో చేతికి గడ్డపార పట్టి పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేశారని ధ్వజమెత్తారు.
అలాగే పరిశ్రమల భూములను, ఇతర భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి, ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ పాలన నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 15 శాతం కమీషన్లు ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అది ఏకంగా 30 శాతం కమీషన్ సర్కార్‌గా మారిందని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు దుయ్యబట్టారు.

