ఐఏఎస్‌కు దివ్య మిట్టల్ రాజీనామా.. నెటిజన్లు షాక్!

కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన యూపీకి చెందిన ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ (Divya Mittal) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 13 సంవత్సరాల ప్రయాణాన్ని ఈ రోజుతో ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగం నుంచి మాత్రమే వైదొలుగుతున్నానని, ప్రజా సేవకు మాత్రం కాదని స్పష్టం చేశారు. దివ్య మిట్టల్ తీసుకున్న నిర్ణయంతో నెటిజన్లు షాకవుతున్నారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేసిన సమయంలో ప్రజల కోసం ఆమె చేసిన పనులను గుర్తు తెచ్చుకుంటున్నారు.

దివ్య మిట్టల్ ఏం రాశారంటే…

ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు దివ్య మిట్టల్ లేఖ విడుదల చేశారు. అనేక భావోద్వేగమైన అంశాలను అందులో పేర్కొన్నారు. ‘సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను జీవితంలో సక్సెస్ కావాలనే కసితో పనిచేశాను. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో రాత్రిళ్లు కూడా పుస్తకాలతో కుస్తీ పట్టాను. ఉన్నత విద్య తరువాత లండన్ లో మంచి జాబ్ వచ్చింది. ఇక నాకు అన్నీ వచ్చేశాయి అనుకునే లోపే.. నా దేశానికి ఏం చేయగలను అనే సందేహం వచ్చింది.

పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనిపించింది. ఐఏఎస్ అందుకు ఉత్తమ మార్గం అని భావించి వెనక్కి వచ్చేశాను. మళ్లీ చదివి ఐఏఎస్ సాధించాను. యూపీలోని ధియోరియా, మీర్జాపూర్ వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు ఒక్కో చోట ఒక్కో అనుభవం. భూమికి పట్టా ఇచ్చినప్పుడు, దివ్యాంగుడికి ఉద్యోగం కల్పించినప్పుడు, రైతుల పొలాలకి సాగు నీరు వచ్చేలా చేసినప్పుడు.. వారి కళ్లల్లో ఆనందం చూశాను. అప్పుడే నిజంగా నాకు ప్రశాంతంగా అనిపించేది’ అన్నారు.

కళ్లు చెమ్మగిల్లుతున్నాయి…

ఎక్కడ పనిచేసినా.. ఆ ప్రజలతో తన అనుబంధం పెరిగిపోయిందని దివ్య మిట్టల్ లేఖలో రాశారు. ‘నేను ప్రజలకు ఏదో ఇవ్వడం కంటే, వారి నుంచే ఎంతో పొందాను. నా హృదయం ప్రజల ప్రేమ, గౌరవం, ఆప్యాయత నిండిపోయింది. ఇక నుంచి వారి నమ్మకం, ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది. కృతజ్ఞతతో నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. లహురియా కొండ ప్రాంతానికి నీళ్లు వచ్చేలా చేసినప్పుడు ఓ వృద్ధురాలు తన వణుకుతున్న చేతులను నా తలపై పెట్టి ఆశీర్వదించడం మర్చిపోలేను. పదవి నాతో లేకపోయినా ఆమె స్పర్శ మాత్రం జీవితాంతం నాతోనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో ఎంతో పాపులర్..

2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన దివ్య మిట్టల్ సోషల్ మీడియాలో ఎంతో ప్రాచుర్యం పొందారు. సివిల్స్ తొలి ప్రయత్నంలోనే ఆమె ఐపీఎస్ సర్వీసుకి ఎంపికైనా.. మరోసారి రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయ్యారు. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు స్ఫూర్తిదాయకమైన పోస్టుల ద్వారా యువతకు ప్రోత్సాహం అందించారు. ఉత్తమ అధికారిణిగా పలు అవార్డులు పొందారు. ఆమె ఇంత త్వరగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>